కరోనా వైరస్.. మూడు నెలలుగా ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మహమ్మారి. చైనా నుంచి ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా అంటూ.. దాదాపు అన్ని ఖండాలను బెంబెలెత్తిస్తోంది ఈ వైరస్. లాక్డౌన్, కర్ఫ్యూ అని తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలనూ ఉపయోగించేశాయి ప్రపంచ దేశాలు. అయినప్పటికీ.. ఐరోపా, అమెరికాలో నిన్న మొన్నటి వరకు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి.
ఇంత కల్లోలంలో ఒక్కసారిగా ఆశలు చిగురించాయ్. మానవాళి ఈ ప్రమాదం నుంచి గట్టెక్కగలదన్న విశ్వాసం పెరిగింది. ఇందుకు కారణం ఐరోపా, అమెరికాల్లో రోజువారీ మృతుల సంఖ్య కొంతమేర తగ్గడం. మునుపటితో పోల్చితే పాజిటివ్ కేసులూ కాస్త తగ్గాయి.
స్పెయిన్లో మృతుల సంఖ్య 15వేలు దాటింది. అయితే బుధవారం 757 మంది మరణించగా.. గురువారం ఆ సంఖ్య 683కు తగ్గింది. దీనిపై ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పందించారు.
"వైరస్ నియంత్రణలోకి వస్తోంది. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో వెనక్కి తిరగకపోవడమే ముఖ్యం. పరిస్థితి తిరిగి మొదటికి రాకూడదు."
--- పెడ్రో సాంచెజ్, స్పెయిన్ ప్రధాని.