కరోనా వైరస్... యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక మహమ్మారి. ఆరోగ్యపరంగానే కాక... ఆర్థిక రంగంలోనూ వైరస్ పెను ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు కరోనా నుంచి రక్షణకు పెద్దస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికానూ కరోనా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ నిత్యావసరాల వస్తువులకన్నా టిష్యూ పేపర్‌కు గిరాకీ ఏర్పడింది. గంటలపాటు క్యూలైన్లలో నిల్చొని మరీ టిష్యూ పేపర్‌ను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.
దక్షిణ కొరియాలో...
చైనా తర్వాత ఎక్కువ కరోనా కేసులు దక్షిణ కొరియాలో నమోదయ్యాయి. అక్కడ 4వేల మందికిపైగా వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొవిడ్-19 బారి నుంచి రక్షణ కోసం మాస్క్‌లను ధరించేందుకు మొగ్గు చూపుతున్నారు కొరియా వాసులు. మాస్క్‌ల కోసం ఉదయం నుంచే క్యూలైన్లలో నిల్చొని మరీ కొనుగోలు చేస్తున్నారు.
టిష్యూలు, మాస్క్‌ల కోసం క్యూలైన్లలో పడిగాపులు! మెక్సికోలో..
మెక్సికో నగరంలో ఇప్పటివరకు ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా నుంచి రక్షణ కోసం మెక్సికో సిటీ కెథిడ్రల్ మతాధికారులు వారి పరిధిలోని చర్చిలకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని ఆదివారం నుంచి అమలులోకి తీసుకొచ్చారు. ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల అత్యవసర పరిస్థితిని విధించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పలు రెస్టారెంట్లు, వ్యాపార దుకాణాలను మూసి వేశారు. ఈ నేపథ్యంలో మాస్క్‌లకు, చేతి రుమాళ్లకు డిమాండ్ ఏర్పడింది. దుకాణదారులు ఎక్కువ రేట్లకు వీటిని విక్రయిస్తున్నారు.
ప్రార్థనా విధానంలో మార్పులు..
ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మత పెద్దలు ప్రార్థన కార్యక్రమాల విధానంలో మార్పులు చేశారు. ప్రార్థనా సమయంలో ఒకరినొకరు కరచాలనం చేసుకోకూడదని తెలిపారు. చర్చి ప్రాంతమంతా పవిత్ర జలాన్ని చల్లాలని పేర్కొన్నారు.