Shelters For Homeless: ఎన్నో కుటుంబాలు నిత్యం ఎన్నో సమస్యలతో సతమతం అవుతుంటాయి. పెద్దదిక్కును కోల్పోయి కొందరు.. ఆర్థిక-ఆరోగ్య-మానసిక సమస్యలతో ఇంటి నుంచి వెలివేతకు గురై మరికొందరు.. ఇలా చెప్పుకుంటూపోతే ఎందరో అభాగ్యులు ఒంటరైపోతారు. విధి వెక్కిరింతకు వీధి పాలై.. ఎండావానలకు ఎక్కడో ఒకచోట తలదాచుకుంటారు. జనంతో నగరాలు కిటకిటలాడుతున్నా ఎవ్వరికీ కానివారుగా మిగిలిపోతారు. ఆ వీధులే వారికి ఆవాసం. ఇలాంటి వారి కోసం అమెరికా లాస్ ఏంజలెస్ చుట్టూ సరికొత్త గ్రామాలు వెలిచాయి. నిరాశ్రయులు.. తమ కాళ్లపై తాము నిలబడేవరకు ధైర్యంగా జీవించేలా, మానవతా దృక్పథంతో వీటిని వెలుగులోకి తెచ్చింది అక్కడి అధికార యంత్రాంగం.
Los Angeles Tiny Homes For Homeless: లాస్ ఏంజలెస్ కౌన్సిలర్ పాల్ క్రికొరియన్ సహకారంతో.. హోప్ ఆఫ్ వ్యాలీ రెస్క్యూ మిషన్ మొదట ఒక గ్రామాన్ని నిర్మించింది. దానికి చాండ్లర్ టినీ హోమ్స్ అని పేరు పెట్టింది. మిగతా వాటికి విభిన్నంగా.. ఎనిమిది ఫీట్ల పొడవు, వెడల్పుతో ఇక్కడ చిన్న ఇళ్లను నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారిగా 39 ఇళ్లు, 85 బెడ్లతో.. ఈ గ్రామాన్ని ప్రారంభించారు. ఇందులో విద్యుత్, ఎయిర్ కండీషనింగ్, వైఫై, స్మోక్ డిటెక్టర్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి.
''నిరుపయోగంగా ఉన్న పార్క్ స్థలంలో ఈ గ్రామాన్ని నిర్మించాము. తాత్కాలికంగా వసతి కావాల్సినవారికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆహారం, తదితర నిత్యవసర సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.''
-లాస్ ఏంజలెస్ కౌన్సిలర్, పాల్ క్రికొరియన్
Houses For Homeless In US: ఈ గ్రామం చుట్టూ ఇనుప కంచెతో పాటు 24 గంటలు నిఘా ఉండేలా సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకు అత్యవసర పరిస్థితిని మినహాయిస్తే ఎవరినీ అనుమతించరు. ఇక్కడికి వచ్చినవారికి ఎలాంటి ఖర్చులూ ఉండవు. అన్ని నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంటాయి. డ్రగ్స్, ఆల్కహాల్, ఆయుధాలతో వచ్చేవారిని అనుమతించరు. ప్రవేశ సమయంలోనే ఎలక్ర్టానిక్ పరికరాలతో చెక్ చేస్తారు. విలువైన వస్తువులు దాచుకోవడానికి లాకర్ల సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక్కడి నిరాశ్రయులకు స్థిర నివాసం వెతికిపెడతారు. బాధితుల సొంత ప్రదేశాన్ని, సామాజిక భద్రతను నిర్ధరించే కార్డులను అందిస్తారు. ఉపాధిలేని వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తారు.
''వీధుల్లో బతికేవారికి ఇది శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు.. కానీ పేదరికాన్ని తగ్గించే మంచి ప్రయత్నం. ఇది ఒక్క లాస్ ఏంజలెస్కే కాదు ప్రపంచానికే ఆదర్శం. అత్యవసరంగా షెల్టర్ కావాల్సిన వారికి కొన్ని రోజులపాటు ఇక్కడ ఉండే విధంగా వీటిని నిర్మించాం.''
- కెన్ క్రాఫ్ట్, రెస్క్యూ మిషన్ సీఈఓ