కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురైన వారిలో మతిమరుపు సమస్య వచ్చే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మహమ్మారి విజృంభించిన తొలినాళ్లలో కొవిడ్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన 150 మంది రోగులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. వీరిలో 73 శాతం మందికి మతిస్థిమితం సరిగా లేదని.. మానసిక స్థితి తీవ్రంగా ప్రభావితమైందని.. ఓ వ్యక్తి ఏకంగా తీవ్ర గందరగోళానికి గురయ్యాడని, ఆందోళనతో స్పష్టంగా ఆలోచించలేకపోయినట్లు తేల్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రఖ్యాత బీఎంజే మెడికల్ జర్నల్‌లో(BMJ Medical Journal) ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనంలో భాగంగా.. 2020 మార్చి-మే మధ్య ఐసీయూలో చేరి డిశ్చార్జ్ అయిన రోగుల వైద్య రికార్డులను పరిశోధకులు విశ్లేషించారు. వారిలో మతిమరుపు రావడానికి గల సాధారణ కారణాలను గుర్తించేందుకు ప్రయత్నించారు. కరోనా వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా(Oxygen Supply to Brain) తగ్గడం సహా రక్తం గడ్డకట్టడం(Blood Clot Symptoms), హార్ట్ఎటాక్కు(Heart Attack After Covid) దారితీస్తుందని.. మొత్తంగా ఏర్పడే బలహీనత వల్ల మతిమరుపు ఏర్పడుతోందని గుర్తించారు.
వారిలో తీవ్ర గందరగోళం..
కొవిడ్ కారణంగా ప్రతికూలతలు కనిపిస్తున్నాయని అమెరికాలోని మిషిగాన్ విశ్వవిద్యాలయ(University of Michigan) అధ్యయన రచయిత ఫిలిప్ వ్లిసైడ్స్ అన్నారు. ముఖ్యంగా ఆసుపత్రిలో చేరడం, కోలుకోవడం కష్టం అవుతోందని చెప్పారు. మతిమరుపు ఉన్న రోగుల్లో గందరగోళం, ఆందోళన, మెదడు వాపు వంటి లక్షణాలు తీవ్రమైనట్లు పేర్కొన్నారు. అలాగే మహమ్మారి ప్రారంభంలో వ్యాక్సిన్లు అందుబాటులో లేని సమయంలో.. మహమ్మారిని నిలువరించడమే కీలక అంశమని.. అందుకే మతిమరుపు నివారణ చికిత్సా నిబంధనలను పక్కనపెట్టినట్లు తెలిపారు.
'వాస్తవానికి మత్తుమందులు, మతిమరుపు(Sedation Delirium) మధ్య దగ్గరి సంబంధం ఉంది. మతిమరుపు ఉన్న రోగులు తరచుగా ఎక్కువ మోతాదులో మత్తుమందులు తీసుకుంటూ ఉంటారు' అని వ్లిసైడ్స్ తెలిపారు.