తెలంగాణ

telangana

ETV Bharat / international

రైతులకు అమెరికా నేతలు, సిక్కుల మద్దతు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు వివిధ వర్గాల నుంచి మద్దతు కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన పలువురు శాసనకర్తలు దిల్లీలో అన్నదాతల నిరసనకు సంఘీభావం ప్రకటించారు. వారంతా శాంతియుతంగా నిరసన కొనసాగించేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. అయితే, దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత విషయాల్లో విదేశీయుల జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది.

Several US lawmakers, American Sikhs voice support for agitating farmers in India
రైతులకు అమెరికా నేతలు, సిక్కుల మద్దతు

By

Published : Dec 8, 2020, 3:41 PM IST

దేశంలో నిరసనలు చేస్తున్న రైతులకు అంతర్జాతీయ స్థాయిలో విస్తృత మద్దతు లభిస్తోంది. అమెరికాకు చెందిన పలువురు చట్ట సభ్యులు, సిక్కు ప్రముఖులు రైతుల పక్షాన గళం విప్పారు. శాంతియుతంగా నిరసన చేసేందుకు వారికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

"తప్పుదోవపట్టించే ప్రభుత్వ నిబంధనల నుంచి రక్షించుకోవడానికి నిరసన చేస్తున్న పంజాబీ రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నాను. హింసా భయం లేకుండా శాంతియుతంగా నిరసన చేసేందుకు ప్రభుత్వం రైతులకు అనుమతి ఇవ్వాలి."

-డగ్​ లమాల్ఫా, అమెరికా చట్టసభ్యుడు

డెమొక్రటిక్‌ కాంగ్రెస్ ‌సభ్యుడు జోష్‌ ఆర్డర్‌ స్పందిస్తూ.."భారత్‌ ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. శాంతియుత నిరసన ఆ దేశ ప్రజల హక్కు. రైతులతో మోదీ సహా ప్రభుత్వ ప్రతినిధులు ఫలవంతమైన చర్చలు జరపాలని కోరుతున్నాను" అని వ్యాఖ్యానించారు. పలువురు నాయకులతో పాటు అమెరికాలో పలు మీడియా సంస్థలు రైతుల ఆందోళనలపై కథనాలు ప్రచురించాయి.

ఇదీ చదవండి:సాగు చట్టాలపై కర్షక భారతం కన్నెర్ర

శాంతియుతంగా నిరసన చేపట్టే ప్రజల హక్కులకు భారత్ కట్టుబడి ఉండాలని మరో చట్టసభ్యుడు టీజే కాక్స్​ పేర్కొన్నారు. రైతుల నిరసనలను గౌరవించి.. అర్థవంతమైన చర్చలు జరపడమే ఉత్తమమైన మార్గమని స్పష్టం చేశారు. అదేసమయంలో పౌరుల భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సిక్కుల లేఖ

మరోవైపు, రైతుల డిమాండ్లను పరిష్కరించాలని అమెరికాలోని పలువురు సిక్కులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చర్చలు కొనసాగించాలని సూచించారు. రైతుల నిరసనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని.. వీటిని ప్రాంతీయ నిరసనలుగా పరిగణించకూడదని అన్నారు. రైతు నిరసనలను వేర్పాటువాద, ఖలిస్థానీ అనుకూల ఆందోళనలుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆందోళనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి దూకుడైన నిర్ణయాలు తీసుకున్నా.. అది ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ లేఖను వాషింగ్టన్ డీసీలో ఉన్న భారత దౌత్యకార్యాలయానికి పంపించారు.

"దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు నిరసనలు చేస్తున్నారు. ఈ చట్టాలను రైతుల సంక్షేమాన్ని దృష్టిలో తీసుకొచ్చినవే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు రైతులు వీటిని కాదనుకుంటున్నారు. చట్టాలకు వ్యతిరేకంగా కఠిన సందేశం ఇస్తున్నారు. కాబట్టి బలవంతంగా ఈ చట్టాలను రుద్దకుండా ఉండాలని మేం కోరుతున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి రైతులు వెన్నెముకగా నిలిచారు. వారి నిర్ణయాన్ని బేఖాతరు చేయకూడదు."

-సిక్కు సంఘాల లేఖ

అయితే విదేశీ నేతలు, రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది పూర్తిగా భారత అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఒక ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత వ్యవహారాలపై విదేశీ నేతల జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది.

ఆందోళనపై పలు ఇతర దేశాల నాయకులు చేసిన ప్రకటనలు తప్పుడు సమాచారంతో, దురుద్దేశపూర్వకంగా చేయిస్తున్న వ్యాఖ్యలని విదేశాంగశాఖ పేర్కొంది.

ఇదీ చదవండి:భారత్​ బంద్​ ప్రశాంతం- రైతు కోసం కదిలిన జనం

ABOUT THE AUTHOR

...view details