డేటింగ్ యాప్స్‌లో అమ్మాయిలకు వల వేసి.. వారిపై అత్యాచారానికి పాల్పడటం న్యూజెర్సీకి చెందిన ఖలీల్ వీలర్- వీవర్(25) అలవాటు. అంతటితో ఆగకుండా వారిని క్రూరంగా హత్య చేయడం అతడి నైజం. అలా 2016లో ముగ్గురిని హత్య చేశాడు. సెప్టెంబర్- డిసెంబర్ మధ్య కాలంలో మూడు మృతదేహాలు బయటపడటం అప్పట్లో సంచలనం సృష్టించింది.
2016 ఆగస్టు 31న, 19ఏళ్ల రాబిన్ వెస్ట్ అనే యువతి.. వీలర్ వాహనం ఎక్కింది. కొన్ని గంటల తర్వాత హత్యకు గురైంది. ఆమెను వీలర్ అత్యాచారం చేసి నెవార్క్ ప్రాంతంలోని తన సొంత నివాసానికి కొద్ది దూరంలోని మరో ఇంట్లో పడేశాడు. అనంతరం ఆ ఇంటికి నిప్పంటించాడు. మృతదేహం వెస్ట్‌దే అని తెలుసుకోవడానికి రెండు వారాలు పట్టింది.
వెస్ట్ మృతదేహం గుర్తించిన నెల రోజుల తర్వాత మరో మహిళ అదే విధంగా హత్యకు గురైంది. జొవాన్ బ్రౌన్‌ను(33) హత్య చేసి, ఓ ఇంట్లో పాతిపెట్టాడు వీలర్. ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు ఆరు వారాల సమయం పట్టింది.
బ్రౌన్ మరణించిన నెల రోజులకు మాంట్క్లెయిర్లోని సారా బట్లర్ అనే మహిళ అదృశ్యమైంది. అమెపైనా హత్యాచారం చేశాడు వీలర్. బ్రౌన్ మృతదేహాన్ని గుర్తించే నాలుగు రోజుల ముందు బట్లర్ మృతదేహం బయటపడింది. వీరందరినీ బట్టలతో గొంతు నులిమి హత్య చేశాడు వీలర్.
నాలుగో మహిళనూ చంపేందుకు ప్రణాళిక రచించాడు. కానీ ఆమె త్రుటిలో తప్పించుకుంది.