అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని రిపబ్లికన్లు వ్యతిరేకించారు. దీని వల్ల సమయం వృథా అని అన్నారు. వాషింగ్టన్ క్యాపిటల్ దాడికి ముందు ట్రంప్ దూకుడుగా ప్రసంగం చేసినంతమాత్రాన.. హింసకు ఆయనే బాధ్యుడు కాలేరని చెప్పారు.
"ట్రంప్‌ను జవాబుదారీగా చేయడం అంటే దిగువ సభలో అభిశంసన పెట్టడం, సెనేట్‌లో దోషిగా తేల్చడమేనా? ట్రంప్ నిర్దోషిగా బయటపడతారు.. జరిగేది అదే. కానీ కాంగ్రెస్ మరేదైనా శిక్ష విధించాలనుకుంటే దాని గురించి పరిశీలించి ఉండాల్సింది. అయితే అది అభిశంసన ప్రవేశపెట్టక ముందే చేసి ఉండాలి. ఆ అవకాశాన్ని దిగువ సభ చేజార్చుకుంది."
-రోజర్ వికర్, మిసిసిప్పీ రిపబ్లికన్ సెనేటర్
రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ సైతం ట్రంప్‌పై విధించిన అభిశంసనను ఖండించారు. ట్రంప్ దోషిగా తేలేందుకు అవకాశమే లేదన్నారు. ప్రసంగాలపై నేరపూరిత ముద్ర వేయాలనుకుంటే ప్రతి ఒక్కరిపై అభిశంసన తీర్మానం పెట్టాల్సి ఉంటుందని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తీవ్రంగా హెచ్చరించిన చక్ షూమర్(డెమొక్రటిక్ నేత)పైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అభిశంసన రాజ్యాంగ విరుద్ధమని, అది దేశాన్ని విభజిస్తుందని అన్నారు. దీనిపై గత నెలలో తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టారు పాల్. అభిశంసనను పక్కనబెట్టాలని సూచించారు. దీనికి 44 మంది రిపబ్లికన్ల మద్దతు లభించింది. ట్రంప్‌ను దోషిగా తేల్చాలంటే 67 మంది సెనేటర్లు అభిశంసనను ఆమోదించాల్సి ఉంటుంది. సభలో డెమొక్రాట్లకు 50, రిపబ్లికన్లకు 50 స్థానాలు ఉన్నాయి.
మంగళవారం సెనేట్‌లో ట్రంప్ అభిశంసన తీర్మానం చర్చకు రానుంది. క్యాపిటల్ ర్యాలీలో ట్రంప్ చేసిన ప్రసంగం సహా ఎన్నికల్లో అక్రమాలపై చేసిన తప్పుడు ఆరోపణలే హింసకు దారితీశాయన్న అభియోగాలపై విచారణ చేపట్టనుంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అందుబాటులో లేని కారణంగా.. డెమొక్రటిక్ సెనేటర్ పాట్రిక్ లీహీ సభకు నేతృత్వం వహించనున్నారు.
ఇదీ చదవండి:ఇరాన్‌పై ఆంక్షలు తొలగించే ప్రసక్తే లేదు: బైడెన్