అమెరికా ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే రెండో సంవాదం రద్దయింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న జరగాల్సిన చర్చ జరగదని కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్(సీపీడీ) ప్రకటించింది. ఇరువురు అభ్యర్థులు ఆ తేదీల్లో 'ప్రత్యామ్నాయ ప్రణాళికలు ప్రకటించారు' అని పేర్కొంది. కాబట్టి అక్టోబర్ 15న డిబేట్ జరగబోదని స్పష్టం చేసింది.
నిజానికి అధ్యక్ష అభ్యర్థుల మధ్య మూడు ముఖాముఖి చర్చలు జరగాలి. ఇప్పటికే ఒకటి ముగియగా.. అక్టోబర్ 15, అక్టోబర్ 22 తేదీల్లో మిగతా రెండు డిబేట్లు నిర్వహించాలని ప్రణాళికలు వేశారు. రెండో డిబేట్ రద్దు కావడం వల్ల.. ఇరువురి మధ్య తుది సంవాదం మాత్రమే జరగనుంది.
ఒకరు ఓకే...
అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారిన పడిన నేపథ్యంలో రెండో ముఖాముఖిపై సందిగ్ధత తలెత్తింది. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెండో డిబేట్‌ను వర్చువల్ పద్ధతిలో జరపాలన్న కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ (సీపీడీ) నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. వర్చువల్‌గా నిర్వహిస్తే తాను పాల్గొనబోనని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన ఆయన.. 'వర్చువల్ పద్ధతిలో జరిగే డిబేట్లో పాల్గొని నా సమయాన్ని వృథా చేసుకోను. ఇది మాకు అంగీకారం కాదు' అని స్పష్టం చేశారు. బైడెన్‌ను రక్షించేందుకే సీపీడీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. సీపీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు.