అధ్యక్ష పదవిపోయినా.. సినిమాలలోనన్నా నటిద్దామనుకున్న ట్రంప్ ఆశలపై అమెరికా మూవీ అసోసియేషన్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తోంది. అసోసియేషన్‌లో ట్రంప్‌కు ఉన్న సభ్యత్వాన్ని రద్దు చేయడానికి తీర్మానించింది. క్యాపిటల్ భవనం మీద దాడి జరగడానికి ట్రంప్ కారణమనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎస్ఏజీ. ట్రంప్ గతంలో సినిమాల్లో నటించే వారు. టీవీ కార్యక్రమాలను నిర్వహించేవారు. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్(ఎస్ఏజీ) లో ట్రంప్‌కు సభ్యత్వం ఉంది.
కాగా ట్రంప్ ఇకపై సినిమాలు నటించకుండా.. టీవీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేయాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఎస్ఏజీ నుంచి ట్రంప్‌ను తొలగించడానికి తీర్మానించింది. ఆ సంస్థ క్రమశిక్షణ కమిటీ ముందుకు దీనికి సంబంధించి తీర్మానాన్ని పంపింది. ఒక వేళ కమిటీ విచారణలో ట్రంప్ దోషిగా తేలితే గిల్డ్ సభ్యత్వాన్ని ఆయన వదులుకోవాల్సి ఉంటుంది.
ట్రంప్ నిర్లక్ష్యంగా ర్యాలీని నిర్వహించి.. అమెరికా క్యాపిటల్ భవనంపై దుండగులు దాడి చేసేలా వారిని ప్రేరేపించారు. జర్నలిస్టుల భద్రతను ప్రమాదంలో నెట్టివేశారు. దీంతో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించాం.
-ఎస్ఏజీ