చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారిని తుదముట్టించేందుకు ప్రపంచదేశాలన్నీ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనైతిక ప్రతిపాదనలు వస్తున్నాయి. వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం వారికి వైరస్ సంక్రమింపజేసి పరీక్షించాలని పలువురు సూచిస్తున్నారు.
అయితే ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుందని, కనీసం ఏడాది పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి బదులుగా వైరస్ తో బాధపడుతున్నవారికి ఇస్తే అతి తక్కువ సమయంలో కచ్చితమైన ఫలితాలు ఇస్తాయని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త స్టాన్లీ ప్లాట్కిన్ అభిప్రాయపడ్డారు.
సంప్రదాయ పద్ధతి..
ఇలాంటి ప్రతిపాదనే ఒకటి జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ప్రచురించారు. వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగించే విధానం 2 శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. కొన్ని దేశాలు ఇప్పటికీ కొన్ని అంటువ్యాధులకు ఈ పద్ధతినే పాటిస్తున్నాయని తెలిపారు.
ఎడ్వర్డ్ జెన్నర్.. వ్యాక్సిన్‌కు ఆద్యుడు. మశూచి వ్యాధికి టీకా ఈయనే కనుగొన్నారు. ఆయన తొలుత 8 ఏళ్ల బాలుడిపై ప్రయోగించారు. ఆ సమయంలో ప్రాణాంతకమైన మశూచి నుంచి ఆ బాలుడు బయటపడ్డాడు. అయితే ఈ విధానంపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రోజుల్లో ఇటువంటి ప్రయోగాలు నైతిక సమీక్షలకు లోనవుతున్నాయి. శాస్త్రవేత్తలు కూడా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ విషయంలో ఈ పద్ధతిని స్వీకరించలేకపోతున్నారు.
ఏమీ తెలియకుండా ఎలా?
అమెరికా అంటువ్యాధులు సంస్థలోని వైద్యులు మాథ్యూ మెమోలీ మరో భిన్నమైన వాదన వినిపించారు. కరోనా ప్రభావం ఎలా ఉంటుందో తెలియదని.. ఈ వైరస్ వల్ల మనుషులు తీవ్రంగా జబ్బు పడతారా లేదా దీర్ఘకాలం సమస్యలు వేధిస్తాయా అన్న స్పష్టత శాస్త్రవేత్తలకు లేదన్నారు.
ఈ సమయంలో ఒకరి శరీరంలోకి వైరస్‌ను పంపి ప్రయోగాలు చేయాలంటే.. ముందుగా ఆ వ్యాధి గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మెమోలీ. అప్పుడే మనం ప్రమాద స్థాయిని అంచనా వేయగలమని చెప్పారు. మరో సీనియర్ శాస్త్రవేత్త కూడా ఈ రకమైన అభిప్రాయాన్నే వెలిబుచ్చారు.