కరోనా వైరస్ సంబంధిత 29 భిన్నమైన జన్యు పరివర్తనా క్రమాల్లో(డీఎన్‌ఏ సీక్వెన్సెస్) అంతర్లీనంగా ఉంజీ జీనోమ్ సిగ్నేచర్‌ను నిమిషాల్లోనే గుర్తించేందుకు కృత్రిమ మేధను ఉపయోగించారు శాస్త్రవేత్తలు. ప్రాణాంతకమైన సార్స్-కొవ్2(కరోనా) వైరస్‌లను వర్గీకరించేందుకు ఇదెంతగానో తోడ్పడుతుందని వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ కెనెడా శాస్త్రవేత్త, భారత సంతతి వ్యక్తి గుర్జీత్ రంధావ తెలిపారు. సులభంగా, వేగంగా ఈ సాధనం పనిచేస్తుందని వెల్లడించారు. మహమ్మారిని కట్టడి చేసి.. వ్యూహ రచన, వైద్య సహాయం అందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గబ్బిలాల్లో ఉండే సర్బికో వైరస్‌లోనే కొవిడ్-19 మూలాలున్నాయని ప్లోస్ వన్ జర్నల్‌లో ప్రచురించిన ఈ పరిశోధన అంచనా వేసింది.
కచ్చితమైన వర్గీకరణ..
గ్రాఫిక్ ఆధారంగా, ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్, డిసిషన్ ట్రీ విధానం ద్వారా అత్యంత వేగంగా, కచ్చితత్వంతో వర్గీకరణ చేయొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. నావెల్ కరోనా వైరస్ జీనోమ్ సిగ్నేచర్లను మెషిన్ లెర్నింగ్ విధానం 100 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుందని పేర్కొన్నారు. కేవలం నిమిషాల్లోనే 5000 కు పైగా వైరల్ జీనోమ్‌లతో కరోనాతో సంబంధాల్ని గుర్తించామని తెలిపారు.