మహమ్మారి కరోనా అంతానికి ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రారంభించిన కొద్ది వారాల్లోనే వైరస్ రూపు మార్చుకొని విరుచుకుపడుతోంది. ఆఫ్రికా, ఐరోపా, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన మ్యుటెంట్లు ప్రపంచమంతా విస్తరిస్తున్నాయి. దక్షిణాఫ్రికా వేరియంట్‌పై ఇప్పటికే అందుబాటులో ఉన్న అనేక టీకాలు సమర్థంగా పని చేయడం లేదని పరీక్షల్లో తేలింది. ఈ క్రమంలో... ఆ దేశంలో మొదలుపెడతాననుకున్న ఆస్ట్రాజెనెకా టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేశారు. పశ్చిమ దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపి తొలిదేశంగా నిలవడమే కాక భారీ ఎత్తున టీకా దిగుమతి చేసుకున్న బ్రిటన్ కూడా ఇప్పుడు కరోనా వేరియంట్ కట్టడికి నానా పాట్లు పడుతోంది.
ఈ క్రమంలో బ్రిటన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని శాస్త్రవేత్తలు అన్ని కరోనా వైరస్ మ్యుటెంట్లకు ఒక్క దెబ్బతో అంతం పలికే వ్యాక్సిన్ దిశగా ప్రయోగాలు ముమ్మరం చేశారు. క్యూర్‌వ్యాక్ ఎన్వీ కొత్త వేరియంట్స్‌ను సమర్థంగా ఎదుర్కోగలదని విశ్వసిస్తూ బ్రిటన్ సర్కారు ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. కొత్త వేరియంట్స్‌కు అనుగుణంగా వేగంగా వ్యాక్సిన్‌లు రూపొందించగలదని ఇంగ్లండ్ తన ఒడంబడికలో తెలిపింది. ఆర్ఎన్ఏ సాంకేతికతకు కృత్రిమ మేథను జోడించి భవిష్యత్‌లో రాబోయే వేరియంట్లను అంచనా వేసి వ్యాక్సిన్ రూపొందిస్తుందని చెప్పింది. ఈ క్రమంలో అంతకు ముందు వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను బ్రిటన్ రద్దు చేసుకుంది.
ఆ టీకాలపైనా అనుమానం కలిగేలా
ఈ నేపథ్యంలో ఇతర ఐరోపా దేశాలు వాటికి పంపిణీ చేసిన వ్యాక్సిన్లకు బూస్టర్లను సరఫరా చేసి కొత్త వేరియంట్లపై పోరుకు సహకరిస్తారా అని ఐరోపా కమిషన్‌ను అడుగుతున్నాయి. దక్షిణ బ్రిటన్‌లో వెలుగుచూసిన వేరియంట్... మోడెర్నా, ఫైజర్, అభివృద్ధి చేసిన అత్యంత సమర్థమైన ఎమ్ఆర్ఎన్ఏ డోస్‌లపైనా సందేహం కలిగేలా చేసింది. ఈ క్రమంలో మ్యుటెంట్లను సమర్థంగా అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు భిన్న కోణాల్లో ఆవిష్కరణలకు దిగాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మైఖెల్ కించ్ అభిప్రాయపడ్డారు.
ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలు బూస్టర్ షాట్ల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపాయి. ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరో వ్యూహంగా వ్యాక్సిన్‌లో రోగనిరోధక శక్తిని ఎప్పటికప్పుడు పెంచేలా భిన్నమైన యాంటీజెన్స్, పరమాణువులను జొప్పించాలన్న సూచనలు కూడా వస్తున్నట్లు కించ్ పేర్కొన్నారు. వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్‌నే ఇప్పటి వరకూ లక్ష్యంగా చేసుకొని వ్యాక్సిన్లు తయారు చేస్తుండగా ఇతర భాగాలను కూడా లక్ష్యంగా చేసుకొని పరిశోధనలు సాగుతున్నాయి. న్యూక్లియోకాప్సిడ్ ప్రొటీన్ల ద్వారా వైరల్ ఆర్ఎన్ఏపై దాడి చేయొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.