కరోనా నుంచి రక్షణ కల్పించే కొత్త రకం పునర్వినియోగ మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. దీన్ని ధరించినవారినే కాకుండా పక్కవాళ్లనూ వైరస్ బారి నుంచి ఇది కాపాడుతుంది. పైగా రోజంతా ధరించడానికి అనువుగా ఉంటుంది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని చెబుతున్నారు.
ఈ పరిశోధన బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త సుందరేశన్ జయరామన్ కూడా ఉన్నారు. జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ మాస్కును అభివృద్ధి చేశారు.
" ప్రస్తుత పునర్వినియోగ క్లాత్ మాస్కుల అంచుల గుండా గాలి లీకవుతోంది. ఈ ఖాళీల నుంచి తుంపర్లు, చిన్నపాటి ఏరోసాల్స్ ద్వారా వైరస్ రేణువులు.. ముక్కులోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తులు ఇలాంటి మాస్కు ధరిస్తే.. వారి నుంచి వైరస్ చాలా తేలిగ్గా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. వీటిని ధరించిన వారి కళ్లజోడు అద్దాలపై పొగమంచు ఏర్పడటానికి కూడా ఈ తొడుగులు కారణమవుతున్నాయి. ముఖానికి సరిగా అమరకపోవడం వల్ల.. తరచూ ఈ మాస్కులను సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. వేరే వస్తువులను పట్టుకున్నాక ఇలా మాస్కును సరిచేసుకునే సందర్భంలో వైరస్ అంటుకునే ప్రమాదం లేకపోలేదు."