కరోనా బాధితులకు చికిత్స చేయడానికి అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చౌకలో ఒక వెంటిలేటర్‌ను తయారుచేశారు. అధునాతన పరిజ్ఞానంతో రూపొందిన వెంటిలేటర్లు అందుబాటులో లేని సందర్భాల్లో ఇది అక్కరకొస్తుందని వారు తెలిపారు. సాధారణ వెంటిలేటర్లలో ఒక సెల్ఫ్ ఇన్‌ఫ్లేటింగ్ సంచి ఉంటుంది. దాన్ని వైద్యులు నొక్కడం ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలిని పంప్ చేస్తారు. అందుకు భిన్నంగా.. అధునాతన ఆటోమేటెడ్ వెంటిలేటర్లలో సంక్లిష్టమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉంటాయి. అవి అనేక అంశాలను స్వయంగా నియంత్రించుకుంటాయి.
కరోనా చికిత్సకు చౌకలో అత్యవసర వెంటిలేటర్ - Stanford University scientists news
కరోనా రోగులకు చికిత్స కోసం అతి తక్కువ ఖర్చుతో అత్యవసర వెంటిలేటర్‌ను ఆవిష్కరించారు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అధునాతన వెంటిలేటర్లు అందుబాటులో లేని సందర్భాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
'కొవిడ్ విజృంభిస్తున్న వేళ వెంటిలేటర్లకు తీవ్ర కొరత ఉంది. అందువల్ల సులువైన, సమర్థమైన సాధనాన్ని రూపొందించాలనుకున్నాం. సాధ్యమైనంత వేగంగా దాన్ని వినియోగంలోకి తీసుకురావాలనుకున్నాం' అని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన మార్టిన్ బ్రెయిడెన్‌బాక్ చెప్పారు. తాజాగా రూపొందించిన సాధనం.. సెల్ఫ్ ఇన్‌ఫ్లేటింగ్ సంచిని తనంతట తానుగా నొక్కుతుంది. తద్వారా గాలిని పంప్ చేస్తుంది. ఇందుకోసం అధునాతన, చౌకైన ఎలక్ట్రానిక్ పీడన సెన్సర్లు, మైక్రో కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. అమెరికాలో ప్రామాణికమైన ఇతర వెంటిలేటర్ 20 వేల డాలర్ల కన్నా ఎక్కువ ధర ఉండగా.. ఈ వెంటిలేటర్ ఖర్చు 400 డాలర్ల కన్నా తక్కువగా ఉంది.