కరోనా వైరస్ మహమ్మారి దాటికి వణికిపోతోన్న ప్రపంచ దేశాలు.. కొవిడ్-19ని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను కనుగొన్నాయి. అయినప్పటికీ రానున్న రోజుల్లో సంభవించే మహమ్మారులపై మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ముందుగానే పసిగట్టి నిర్మూలించాలని కృతనిశ్చయంతో ఉన్న శాస్త్రవేత్తలు.. భవిష్యత్తులో సంభవించే మహమ్మారుల నిర్మూలన కోసం 'యూనివర్సల్ కరోనావైరస్ వ్యాక్సిన్'ను రూపొందించారు. తాజాగా ఈ వ్యాక్సిన్ కొవిడ్-19పైనే కాకుండా మరిన్ని కరోనా వైరస్‌లపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగాల్లో తేలడం ఊరట కలిగించే విషయం.
ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు..
2003లో విజృంభించిన సార్స్(SARS) తోపాటు ప్రస్తుతం వణికిస్తోన్న కొవిడ్-19 వంటి మహమ్మారుల ప్రమాదం భవిష్యత్తులోనూ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, ఏ వైరస్ వల్ల మహమ్మారి విజృంభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ నేపథ్యంలో కొవిడ్-19తోపాటు భవిష్యత్తులో వివిధ రకాల కరోనావైరస్‌ల వల్ల సంభవించే మహమ్మారుల నుంచి రక్షణ కల్పించేందుకు అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ (UNC) శాస్త్రవేత్తలు ఓ యూనివర్సల్ వ్యాక్సిన్‌ను రూపొందించారు. ముఖ్యంగా జంతువుల నుంచి మానవులకు సోకే కరోనావైరస్ కుటుంబానికి చెందిన ఇతర వైరస్‌లను ఎదుర్కొనేలా దీనిని అభివృద్ధి చేశారు. ఎలుకల్లో జరిపిన ప్రయోగాల్లో ఇది కొవిడ్-19తో పాటు ఇతర కరోనావైరస్‌ల ప్రమాదకర వేరియంట్లను ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సెకండ్ జనరేషన్ వ్యాక్సిన్ పేరుతో జరిగిన తాజా అధ్యయనం 'జర్నల్ సైన్స్'లో ప్రచురితమైంది.
ఏ సాంకేతికత ఉపయోగించారంటే..!
సార్స్‌తో పాటు కొవిడ్-19కు కారణమైన కరోనావైరస్‌ల కుటుంబానికి చెందిన సర్బెకోవైరస్‌లపైనే శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇందుకోసం ఫైజర్, మోడెర్నా వినియోగించిన ఎంఆర్‌ఎన్‌ఏ (mRNA) మాదిరి సాంకేతికతతో ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. అయితే, కేవలం ఒక వైరస్‌కు చెందిన mRNA కోడ్‌ను కాకుండా, పలు కరోనా వైరస్‌లకు సంబంధించిన mRNAలను ఒకేదగ్గర జోడించారు. దీనిని ప్రయోగాల్లో భాగంగా ఎలుకలకు ఇవ్వగా.. శరీరంలో ఆరోగ్యకర కణాల్లోకి చొచ్చుకుపోయే స్పైక్‌ప్రొటీన్‌లను తటస్థీకరించే సమర్థవంతమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన B.1.351 వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు కనుగొన్నారు.
భవిష్యత్తు మహమ్మారులకు చెక్..?
పరిశోధనల్లో భాగంగా కొవిడ్‌కు కారణమైన సార్స్-కోవ్‌తో పాటు వాటికి సంబంధించిన ఇతర వైరస్‌లు సోకిన ఎలుకలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం వాటిలో ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిపై తదుపరి ప్రయోగాలు మానవుల్లో వచ్చే ఏడాది చేపట్టే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇక కొత్తగా వెలుగుచూసే వేరియంట్‌ల వల్ల సంభవించే విజృంభణలను నిర్మూలించే సామర్థ్యం ఈ వ్యాక్సిన్‌కు ఉందని తాజా పరిశోధనకు నేతృత్వం వహించిన నార్త్ కరోలినా యూనివర్సిటీలోని ఎపిడమాలజిస్ట్ రాల్ప్ బారిక్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఉద్భవించే ప్రమాదకర వైరస్‌ల నుంచి మానవులను రక్షించుకునేందుకు ఇలాంటి యూనివర్సల్ వ్యాక్సిన్‌లు రూపొందించవచ్చని UNCకి చెందిన మరో శాస్త్రవేత్త డేవిడ్ మార్టినేజ్ సూచించారు. ఇందులో భాగంగా తాజాగా జరిపిన ప్రయోగాలు రెండోతరం టీకాల రూపకల్పనకు ఎంతో ఆశాజనకంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఇలాంటి వ్యూహాలతో బహుశా సార్స్-కోవ్-3ని నిర్మూలించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:టీకా విధానంపై వాగ్వాదం.. చర్చకు విపక్షాల పట్టు!