ప్రస్తుత పరిస్థితుల్లో మానవుల్లో అవయవమార్పిడి సర్వ సాధారణమే అయినప్పటికీ అవయవాల కొరత వేధిస్తోంది. ఇందుకు పరిష్కారం కనుగొనే దిశగా శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను మనషులకు అమర్చే అంశంపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన రోగికి పంది కిడ్నీ (Pig Kidney to Human) అమర్చాలని నిర్ణయించారు. ఇందుకు ఆ రోగి బంధువులు కూడా అంగీకరించగా.. గత నెల ఆపరేషన్ (Pig Kidney Transplant) నిర్వహించారు.
పంది కిడ్నీని రోగి శరీరానికి (Pig Kidney to Human) అమర్చి మూడు రోజల పాటు పరిశీలించారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని సర్జన్ డా. రాబర్డ్ మోంట్గోమెరి తెలిపారు.
జన్యు సవరణ చేసి..
అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనే క్రమంలో గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పందుల అవయవాలపై (Pig Kidney Human Transplant) దృష్టి పెట్టారు. దీంట్లో కొన్ని సమస్యలున్నాయి. పంది కణాల్లోని గ్లూకోజ్ మనిషి శరీర వ్యవస్థకు సరిపోలడం లేదు. ఇది రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి తిరస్కరణకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చేసిన ప్రయోగంలో జన్యు సవరణ చేసిన పంది నుంచి అవయవాన్ని (Pig Kidney to Human) సేకరించారు. పంది కణాల్లో చక్కెర స్థాయిలను తొలగించి, రోగ నిరోధక వ్యవస్థ దాడిని నివారించేలా జన్యువుల్లో మార్పులు చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైందని, అవయవ మార్పిడిలో ఇది కీలకమైన ముందడుగని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.