భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇప్పుడే కాదు : ట్రంప్ అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం ఇప్పట్లో కుదిరేలా కనిపించడం లేదు. భారత పర్యటనకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిచ్చాయి.
భారత్‌తో పెద్ద ఒప్పందాన్ని భవిష్యత్తులో కుదుర్చుకొనే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఈ ఒప్పందం జరుగుతుందా లేదా అన్నది తనకు తెలియదని పేర్కొన్నారు.
భారత పర్యటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై సర్వత్రా అంచనాలు నెలకొన్న వేళ.. ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే మున్ముందు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
ఊహాగానాలకు చెక్..
ఫిబ్రవరి 24న ట్రంప్ భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలోనే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంతా భావించారు. అ దిశగా చర్చలు కూడా జరిగినట్లు పలువురు అధికారులు తెలిపారు. కానీ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో వాటిపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు భారత్‌కు రానున్న ట్రంప్ బృందంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి లైట్‌హైజర్ ఉండే అవకాశం లేదని అక్కడి అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్.. ప్రధాని మోదీని మాత్రం ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. భారత ప్రధానితో కలిసి రోడ్ షోలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
"భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చు. కానీ అది భవిష్యత్తులో ఉంటుంది. మోదీ అంటే నాకు చాలా ఇష్టం. విమానాశ్రయం నుంచి కార్యక్రమం వేదిక వరకు 7 మిలియన్ల ప్రజలు హాజరవుతారని మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద మైదానం(మొతేరా)లో కార్యక్రమం జరగనుంది. నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది."
డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు