అమెరికాలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల అమ్మకం, తయారీని నిషేధించిన తొలి నగరంగా శాన్ఫ్రాన్సిస్కో నిలిచింది. ఈ-సిగరెట్ల నిషేధంపై కొత్త చట్టాన్ని నగర పర్యవేక్షక మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. యువతపై అధిక ప్రభావం చూపటం, ప్రజారోగ్య పరిణామాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండలి సభ్యులు తెలిపారు.
గతంలోని ఆర్డినెన్స్ ప్రకారం శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఈ-సిగరెట్స్ ఉత్పత్తులను దుకాణాల్లో కానీ, ఆన్లైన్ ద్వారా కానీ అమ్మకాలు చేపట్టేందుకు అమెరికా ఆహార, ఔషధ విభాగం అనుమతులు తీసుకోవాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం చట్టంతో పూర్తిగా నిషేధం అమలులోకి వచ్చింది.