తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​- రష్యా చమురు ఒప్పందం.. అమెరికా ఏమందంటే?

India Russia: రష్యాతో భారత్​ చమురు ఒప్పందం కుదుర్చుకుంటే ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదని అమెరికా తెలిపింది. అయితే చరిత్రలో భారత్​ తప్పుడు వైపు ఉండొచ్చని హెచ్చరించింది.

Russian oil deal could place New Delhi on wrong side of history
భారత్​-రష్యా చమురు ఒప్పందంపై అమెరికా ఏమందంటే?

By

Published : Mar 16, 2022, 12:19 PM IST

India Russia Oil Deal: రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ విషయంలో భారత్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నట్లు కాదని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంతో భారత్‌ చరిత్రలో తప్పుడు వైపు ఉండొచ్చని హెచ్చరించింది.

ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా ప్రపంచ దేశాలు అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ దేశం నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులు చేసుకోరాదని అగ్రరాజ్యం నిర్ణయించింది. అయితే ఈ ఆంక్షలతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా.. తమ దేశం నుంచి ముడి చమురును భారత్‌కు డిస్కౌంట్‌లో అమ్మాలని అనుకుంటున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు భారత్‌ కూడా సిద్ధంగా ఉందనే కథనాలు కూడా వస్తున్నాయి.

US On India Russia Oil Deal

ఈ నేపథ్యంలోనే భారత్‌కు రష్యా ఆఫర్‌పై వైట్‌ హౌస్​ మీడియా కార్యదర్శి జెన్‌సాకిని విలేకరులు ప్రశ్నించారు. దీనికి సాకి స్పందిస్తూ.. ''రష్యా నుంచి డిస్కౌంట్‌లో చమురు కొనుగోలు చేయడంలో ఆంక్షలను ఉల్లంఘించినట్లు కాదు. అయితే అలాంటి చర్య చేపడితే చరిత్ర పుస్తకాల్లో మీరు(భారత్‌ను ఉద్దేశిస్తూ) ఏ వైపున ఉంటారనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ విషయంలో భారత్‌ ముందుకెళ్తే తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లే అని అనుకోవాల్సి వస్తుంది. రష్యా నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారంటే.. ఉక్రెయిన్‌పై దండయాత్రను కూడా సమర్థిస్తున్నట్లే.'' అని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను సమర్థించడం లేదని భారత్‌ ప్రకటించింది. ఈ విషయంలో ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతోంది. అయితే రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానాలకు మాత్రం భారత్‌ దూరంగా ఉంటూ వస్తోంది. రష్యా నుంచి భారత్‌ సైనిక పరికరాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ తటస్థ వైఖరి పాటిస్తున్నట్లు బైడెన్‌ యంత్రాంగం ఇప్పటికే చాలా సార్లు అభిప్రాయాలు వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:రసాయన దాడుల ముప్పు.. ఉక్రెయిన్​ ప్రజల్లో గుబులు!

ABOUT THE AUTHOR

...view details