UNSC meeting on Ukraine: ఉక్రెయిన్లోని భారతీయులతో పాటు అమాయకులైన ఇతర దేశాల పౌరులను సురక్షితంగా, నిరంతరాయంగా తరలించాలని డిమాండ్ చేశారు ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్లోని పరిస్థితులపై మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్లకు విన్నవించుకున్నప్పటికీ సుమీలో చిక్కుకున్న తమ విద్యార్థులను తరలించేందుకు సురక్షిత కారిడార్ ఏర్పాటు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
"ఉక్రెయిన్ నుంచి 20,000 మంది భారత పౌరులు సురక్షితంగా స్వదేశం చేరేందుకు సదుపాయాలు కల్పించగలిగాం. ఇతర దేశాల పౌరులు వారి స్వదేశానికి చేరుకునేందుకు సాయపడ్డాం. తటస్థ, స్వతంత్రత, నిష్పాక్షికత అనే నియమాలపై ఆధారపడి మానవతా చర్యలు ఉంటాయి. ఉక్రెయిన్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. తీవ్ర మానవ సంక్షోభానికి దారితీస్తోంది. తక్షణం ఈ అంశంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. ఐరాస అంచనా ప్రకారం 1.5 మిలియన్ల మంది ఉక్రెయిన్ ప్రజలు సరిహద్దు దేశాలకు వలస వెళ్లారు. ఓ భారతీయ విద్యార్థితో పాటు 140 మంది మృతి చెందారు. యువకుడి మృతికి యావత్ భారత్ కన్నీరు పెట్టుకుంది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. "
- టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి.