మహాత్మా గాంధీ జీవితకాలంలో ఎవరినీ ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదని కానీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన సోలార్ పార్క్‌ను బంగ్లాదేశ్ అధినేత్రి షేక్ హసీనా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో కలిసి మోదీ ప్రారంభించారు.
'సమకాలీన ప్రపంచంపై గాంధీజీ ముద్ర' అనే శీర్షికతో ఐరాస వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. భారత స్వాతంత్ర్యానికి మాత్రమే కాదని.. ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకోవడానకి గాంధీ అనుసరించిన మార్గం ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు మోదీ.
"గాంధీజీ తన జీవితం ద్వారా ఇతరులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదు. కానీ ఆయన జీవించిన విధానమే ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం మనం 'ఎలా ఆకట్టుకోవాలనే' లక్ష్యంతో బతుకుతున్నామని... కానీ గాంధీ విధానం 'ఎలా స్ఫూర్తి నింపాలనే' దానిపై ఆధారపడి ఉంది. "
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
పనిలేకుండా ఉండటాన్ని గాంధీజీ ఒప్పుకునేవారు కాదని, విలువలు లేని వ్యాపారాన్ని, మానవత్వం లేని శాస్త్ర సాంకేతికత, త్యాగం లేని మతం, విలువలు లేని రాజకీయాలకు ఆయన వ్యతిరేకంగా పనిచేసేవారని తెలిపారు మోదీ.