తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ఉన్నా మాస్క్‌? నీకే మంచిది గురూ..

కరోనాను అడ్డుకోవడమే కాదు.. మాస్కు పెట్టుకోవడం వల్ల మరో ప్రయోజనం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. మాస్కు వల్ల మన శ్వాస వ్యవస్థ పొడిబారకుండా ఉంటుందని తేలింది. కరోనా సోకిన వారు మాస్కును ధరించటం వల్ల ఆ వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంటుందని స్పష్టమైంది.

why wearing mask here is another reason
కరోనా ఉన్నా మాస్క్‌? నీకే మంచిది గురూ..

By

Published : Feb 14, 2021, 5:50 PM IST

మహమ్మారి కరోనా మరింత విజృంభించకుండా.. కేసులు, మరణాల సంఖ్య మరింతగా పెరగకుండా అడ్డుకున్న అస్త్రాలు మాస్క్‌లే. వృత్తి, విద్య వంటి కారణాల వల్ల బయటకు వెళ్లాల్సిన వ్యక్తులకు మాస్కులు రక్షణ కల్పిస్తాయి. ఐతే వీటి వల్ల మరో లాభం కూడా ఉందని అమెరికాలో జరిగిన తాజా పరిశోధనలో వెల్లడైంది. మాస్కును ధరించటం వల్ల మనం విడిచిన ఊపిరిలోని తడి.. శ్వాస వ్యవస్థను కూడా పొడిబారకుండా ఉంచుతుందట. ఇప్పటికే కరోనా సోకిన వారు మాస్కును ధరించటం వల్ల వారిలో ఆ వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంటుందని పరిశోధకులు తెలియచేశారు. అమెరికా జాతీయ సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో చేపట్టిన ఈ పరిశోధన ఫలితాలను బయోఫిజికల్‌ జర్నల్‌లో ప్రచురించారు.

ఏం చేశారంటే..

ఓ వాలంటీరు వదిలిన ఊపిరిని ఓ స్టీలు పెట్టెలోకి వెళ్లేలా చేసి పరిశీలించారు. ఆయన మాస్కు వేసుకోకుండా ఊపిరి విడిచినపుడు ఆ బాక్సులో తేమశాతం పెరిగింది. కాగా, మాస్కు ధరించినప్పుడు ఈ శాతం తక్కువగా ఉంది. అంటే మాస్కు చెమ్మను నిలిపి ఉంచటంతో అది తిరిగి శరీరం లోనికి వెళ్లింది. ఈ పరిశోధనలో భాగంగా ఎన్‌ 95, మూడు పొరలున్నవి, మందంగా ఉన్న కాటన్‌ మాస్కులు వంటి పలు మాస్కులను.. వివిధ ఉష్ణోగ్రతల వద్ద పరిశీలించారట.

తగ్గుతున్న కొవిడ్‌ తీవ్రత

మాస్కులు ధరించినపుడు లోనికి పీల్చుకునే గాలిలో అధిక శాతం తేమ ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. ఈ అధిక తేమ శ్వాస నాళాన్ని తడిగా ఉంచుతోంది. ఆ విధంగా శ్లేష్మాన్ని (కఫం) తొలగించి.. హానికర కణాలు, సూక్ష్మజీవులు ఊపిరితిత్తులకు చేరకుండా ఆపుతుందట. అంతేకాకుండా ఇంటర్‌ఫెరాన్లు అనే ప్రత్యేక ప్రొటీన్ల ఉత్పత్తికి దోహదం చేస్తుందని.. ఇవి ప్రాథమిక దశలో వ్యాధికణాలతో పోరాడతాయని వెల్లడైంది. ఆ విధంగా మాస్కు ధరించటం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తోందని తద్వారా కొవిడ్‌ తీవ్రత కూడా తగ్గుతున్నట్టు ఆధారాలు లభించాయని ముఖ్య పరిశోధకుడు ఆడ్రియాన్‌ బాక్స్‌ వివరించారు.

అంటే మాస్కు ధరించటం ద్వారా తెలియకుండానే మరో మంచిపని చేస్తున్నారని.. కరోనా ఉన్నా, లేకున్నా మాస్కు ధరించటం తప్పనిసరని ఈ సందర్భంగా నిపుణులు నొక్కి చెప్పారు.

ఇదీ చదవండి:కరోనా మ్యుటెంట్లు అన్నింటికీ ఒకటే వ్యాక్సిన్​!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details