చైనా పేరు వింటేనే కన్నెర్రజేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశంలో వ్యాపారం చేసేందుకు ప్రయత్నించారంటే నమ్మలేం కదా!... కానీ అవుననే అంటోంది న్యూయార్క్ టైమ్స్ నివేదిక. చైనాలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ట్రంప్ ప్రయత్నించారని,తొలిసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే వరకు అక్కడ కార్యాలయాన్ని నిర్వహించారని పేర్కొంది. ఓ ప్రభుత్వ సంస్థతో భాగస్వామ్యం ఏర్పరచుకునేందుకూ చూశారని తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్‌కు చైనా, బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు ఆయన పన్ను నివేదికల ఆధారంగా వెల్లడించింది న్యూయార్క్ టైమ్స్.
అయితే.. కార్పొరేట్ పేర్లతో విదేశీ ఖాతాలు ఉన్నందున.. వాటికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకి తెలియలేదు. చైనాలోని ఖాతాను.. ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్స్ మేనేజ్మెంట్ ఎల్ఎల్సీ నిర్వహిస్తోంది. 2013-2015 వరకు లైసెన్స్‌ల కోసం ఒప్పందం చేసుకునే సమయంలో సుమారు 1,88,561 డాలర్ల పన్ను చెల్లించినట్లు టాక్స్ రికార్డులు చెబుతున్నాయి.
స్థానిక పన్నులను చెల్లించేందుకు అమెరికాలోని చైనా బ్యాంకులో ఖాతా తెరిచినట్లు అధ్యక్షుడు ట్రంప్ సంస్థ న్యాయవాది అలాన్ గార్టెన్ తెలిపారు.
"ఆసియాలో హోటల్స్‌ను విస్తరించేందుకు చైనాలో కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత మా సంస్థ బ్యాంకు ఖాతాను తెరిచింది. కానీ, ఎలాంటి ఒప్పందాలు, లావాదేవీలు, ఇతర వ్యాపార కార్యక్రమాలు జరగలేదు. 2015 నుంచి మా ఆఫీసు మూసివేసి ఉంది. దానివల్ల బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ ఎలాంటి ఇతర అవసరాలకు ఖాతాను వినియోగించలేదు. "