యాంటీ వైరల్ ఔషధం రెమిడెసివిర్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న గిలిద్ సైన్సెస్ స్టాక్‌నంతా అమెరికా కొనుగోలు చేసింది. ఆ విషయాన్ని యూఎస్ ఆరోగ్య, మానవ సేవల విభాగం(హెచ్‌హెచ్‌ఎస్) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఏకైక తయారీ సంస్థ గిలిద్ సైన్సెస్ నుంచి 5 లక్షల డోసులను తమ దేశం కొనుగోలు చేసిందని దానిలో పేర్కొంది. కొవిడ్-19 బాధితులకు ఉపశమనం కలిగిస్తుందని భావించడంతో చాలా దేశాలు దీనిపై ఆశలు పెట్టుకున్నాయి.
'కొవిడ్-19 చికిత్స నిమిత్తం అనుమతి పొందిన ఔషధాన్ని అమెరికన్లకు అందుబాటులో ఉంచడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సాధ్యమైనంత వరకు అవసరమైన ప్రతి అమెరికన్ బాధితుడు రెమిడెసివిర్ పొందేలా చూడాలనుకుంటున్నాం. కొవిడ్-19 చికిత్సా విధానాలు తెలుసుకోడానికి, వాటిని అందించడానికి ట్రంప్ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది' అని హెచ్‌హెచ్‌ఎస్ కార్యదర్శి అలెక్స్ అజార్ వెల్లడించారు. జులై నెలలో 100 శాతం, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 90 శాతం ఉత్పత్తి కానున్న ఔషధాన్ని కొనుగోలు చేసినట్లు ఆ ప్రకటనను బట్టి తెలుస్తోంది. క్లినికల్ ట్రయల్స్ కోసం కొంత కేటాయించినట్లు తెలిపింది. అయితే ఈ ప్రకటనపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.