అగ్రరాజ్య అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో ముందస్తు పోలింగ్, ఎన్నికల రోజు నిర్వహించే పోలింగ్ రెండూ కీలకమే. ఈ సారి ఎన్నికల్లో కరోనా విజృంభణ నేపథ్యంలోబైడెన్ మద్దతుదారులు 'మెయిల్ ఇన్' ఓటింగ్‌కు మొగ్గుచూపారు. ట్రంప్ అనుకూలురు 'ఇన్ పర్సన్' బ్యాలెట్ ఓటింగ్‌కు జై కొట్టారు. ఈ క్రమంలోఓట్ల లెక్కింపు సమయంలో ఆధిక్యాన్ని చూసి విజేతను నిర్ణయించలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉదాహరణకు ఫ్లోరిడాలో పోలింగ్ ముగిసి.. ఓట్ల లెక్కింపు ముందస్తు ఓటింగ్‌తో ప్రారంభిస్తే.. జో బైడెన్ ముందంజలో ఉంటారు. అదే గంట తర్వాత పెన్సిల్వేనియాలో లెక్కింపు మొదలైతే.. అప్పుడు ట్రంప్ ఆధిక్యంలో ఉంటారు. ఇలాంటి ఫలితాలు చూసి వెంటనే ఓ నిర్ణయానికి రాలేము. మెయిల్ ఇన్/ అబ్సెంటీ ఓట్లను లెక్కించినప్పుడు ఫలితాలు ఒకలా.. బ్యాలెట్ ఓట్లను లెక్కించినప్పుడు మరోలా మారిపోతాయి.
'ఎలక్షన్ డే' ముందే మెయిల్ ఇన్ ఓట్లు లెక్కిస్తే.. ఆయా రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యంలో ఉంటారు. అప్పుడు ఏ పోల్స్ చూసినా డెమొక్రాట్లే గెలుస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ నవంబర్ 3 తర్వాత స్వింగ్ మొదలై ట్రంప్ ఆధిక్యంలో ఉంటారు. అప్పుడు రిపబ్లికన్లు జోష్ మీదుంటారు.
ఫ్లోరిడా, నార్త్ కరోలినా ప్రాంతాల్లో ఇప్పటికే మెయిల్ ఇన్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫలితాలు నవంబర్3 నాటికి వెల్లడికానున్నాయి. అప్పుడు బైడెన్ ఆధిక్యంలో ఉంటారు. ఎలక్షన్ డే రోజున ఓటింగ్ వేసేవాళ్లు ట్రంప్‌కు మద్దతిస్తున్నట్లు లెక్క. వీరందరి ఓటింగ్ వల్ల.. తొలుత డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్నా చివరికి ఫలితాలు రిపబ్లికన్ల వైపే మెగ్గుచూపే అవకాశముంది.
టెక్సాస్, లోవా, ఒహియా ప్రాంతాల్లో 2016లో ట్రంప్ సునాయసంగా గెలిచారు. అయితే ట్రంప్ ఆధిపత్యానికి చెక్ పెడుతూ.. బైడెన్ నుంచి ఈ ఏడాది తీవ్ర పోటీ ఎదురైంది. ఈ ప్రాంతంలో తొలుత రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఆధిక్యంలో ఉన్నా.. మెయిల్ ద్వారా వేసిన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి డెమొక్రాట్ అభ్యర్థి బైడెన్ రేసులోకి రావచ్చు.
సుప్రీంలో...
మిచిగాన్‌లో ఎలక్షన్ ముందురోజు నుంచే మెయిల్ ఇన్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఎందుకంటే సాధారణ ఇన్ పర్సన్ బ్యాలెట్లతో పోలిస్తే.. మెయిల్ ఇన్ బ్యాలెట్ల లెక్కింపునకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. మెయిల్ ఇన్‌లో.. బ్యాలెట్ల సేకరణ, తరలింపు, లెక్కింపు సమయంలో సంతకం సరిపోల్చడం వంటి ప్రక్రియలు ఉంటాయి.