కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి ప్రపంచదేశాలు. అయితే ఆంక్షలు సడలిస్తే కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలంటే ఆంక్షలు సడలించక తప్పడం లేదు.
ఈ విపత్కర పరిస్థితిని దీటుగా ఎదుర్కొనేందుకు ఓ పరిష్కార మార్గాన్ని చూపారు అమెరికాలోని జార్జియా సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకులు. కరోనా నుంచి కోలుకున్నవారు.. ఈ మహమ్మారి వ్యాప్తి రేటును తగ్గించేందుకు ఉపయోగపడతారని వెల్లడించారు. నేచర్ మెడిసిన్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
ఎలా..?
కరోనా నుంచి కోలుకున్న వారిలోని షీల్డ్ ఇమ్యూనిటీ.. మరోమారు వైరస్ బారిన పడే అవకాశాలను బాగా తగ్గిస్తుందని అంచనా వేశారు పరిశోధకులు. ఆరోగ్య కేంద్రాలతో పాటు మనుషుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేందుకు వీరు సురక్షిత ప్రత్యమ్నాయంగా ఉపయోగపడతారని వెల్లడించారు. దీని ద్వారా వైరస్ వ్యాప్తి రేటు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.