కరోనా కుటుంబానికి చెందిన మరో వైరస్ మానవాళిని మరోమారు ఇబ్బంది పెట్టనున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఇది ప్రధానంగా పందుల నుంచి వ్యాపించే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ వైరస్ మూలాలు చైనాలో ఉన్నట్లు వెల్లడించారు. పంది పిల్లల్లో తీవ్ర విరేచనాలు కలిగించే ఈ వైరస్.. మానవులకు సంక్రమించే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రకాన్ని తొలిసారి 2016లో చైనాలో కనుగొన్నారు. ఇది కూడా కరోనా వైరస్ కుటుంబానికి చెందినదే. సాడ్స్-కోవ్ అని పిలుస్తారు.
ఈ వైరస్ గబ్బిలాల నుంచి చైనాలో పందులకు వ్యాపించింది. ముఖ్యంగా పంది పిల్లలకు విరేచనాలు కలిగించి వాటి మరణాలకు ఈ వైరస్ కారణమవుతోంది. దీని వ్యాప్తి అక్కిడితో ఆగిపోదంటున్నారు శాస్త్రవేత్తలు. మానవుని కాలేయం, పేగులు, జీర్ణకోశం పైనా ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. ఈ విషయం ప్రయోగశాలల్లో జరిపిన తాజా ప్రయోగాల్లో వెల్లడైందని తెలిపారు. అదే జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.