ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని అందరికీ అందుబాటులో ఉంచేందుకు కట్టుబడి ఉంటామని క్వాడ్ దేశాధినేతలు మరోసారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనల ప్రకారం ఆ ప్రాంతంలో స్వేచ్ఛా రవాణా ఉండేలా చూస్తామని పునరుద్ఘాటించారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
ఇండో పసిఫిక్లో ప్రాంతంలో దూకుడు ప్రదర్శిస్తున్న చైనాకు ఈమేరకు పరోక్ష సందేశమిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని యొషిహిదె సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలిసి.. వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో వ్యాసం రాశారు. అన్ని దేశాలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోగలగాలని పేర్కొన్నారు. నాలుగు దేశాల ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా కలిసి పనిచేశాయని, తొలిసారి జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిపాయని చెప్పారు.
సంక్షోభం నుంచి...
క్వాడ్ దేశాల మధ్య సహకారం.. సంక్షోభ సమయంలో ఏర్పడిందని దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. 2004లో ఇండోనేసియాలో సంభవించిన తుపాను ప్రమాదాన్ని నేతలు ప్రస్తావించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం.. సహాయం కోసం అర్థించినప్పుడు ఈ నాలుగు దేశాలు స్పందించాయని చెప్పారు. ఆచరణాత్మక సహకారం, మానవతా సహాయం కోసం ఈ దేశాలు పాటుపడ్డాయని వివరించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడం సహా ఈ ప్రాంతానికి అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.