శరీరంపై అకస్మాత్తుగా దద్దుర్లు రావడం, కాలివేళ్లు ఎర్రబడడం లాంటి చర్మ మార్పులను కూడా కరోనా లక్షణాలుగా భావించవచ్చని ఓ తాజా అధ్యయనం పేర్కొంది. 12 శాతం మంది కరోనా రోగుల్లో దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలతో పాటు ఇవి కనిపించగా.. మిగతా వారిలో లేవని ఆ నివేదిక వెల్లడించింది.
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ, ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ డెర్మటోలాజిక్ సొసైటీల సహకారంతో... మసాచ్యుసెట్స్ జనరల్ హాస్పిటల్ (ఎంజీహెచ్), హార్వర్డ్ మెడికల్ స్కూల్ (హెచ్ఎంఎస్) పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. కరోనా ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న చర్యవ్యాధుల గురించి వివరించడానికి, వాటి జాబితా తయారుచేయడానికి... వీరు ఒక అంతర్జాతీయ రిజిస్ట్రీని రూపొందించారు.
"ఈ రిజిస్ట్రీ... ఏఏ చర్మ వ్యాధులను కరోనా లక్షణాలుగా గుర్తించవచ్చో తెలుపుతుంది. కొవిడ్-19 వైరస్ నిర్దిష్టంగా ఒక రకమైన దద్దుర్లు కలిగిస్తుందని చెప్పలేం. అయితే అది రకరకాల దద్దుర్లు కలిగిస్తుందని మాత్రం గుర్తించాం."
- ఎస్తేర్ ఈ ఫ్రీమెన్, పరిశోధకుడు