అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన విచారణను వేగవంతం చేసింది దర్యాప్తు కమిటీ. వచ్చే వారం తొలిసారి బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. క్యాపిటోల్ హిల్ భవనంలో జరిగే విచారణలో.. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల చట్ట సభ్యులు సాక్షులను ప్రశ్నించే ప్రక్రియను లైవ్ ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.
అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో కీలక వ్యక్తిగా ఉన్న అమెరికా దౌత్యవేత్త విలియం టేలర్ సహా ఇద్దరు అధికారులు వచ్చే బుధవారం విచారణకు హాజరవుతారని దర్యాప్తు కమిటీ ఛైర్మన్ అడమ్ చిఫ్ తెలిపారు. యురోపియన్, యురేసియన్ బ్యూరోకు నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జార్జ్ కెంట్ నవంబర్ 13న, ఉక్రెయిన్‌లో అమెరికా మాజీ రాయబారి మేరీ యోవనోవిచ్ నవంబర్ 15న సాక్ష్యం చెప్పనున్నారని తెలిపారు.
అధ్యక్షుడిపై అభిశంసన దర్యాప్తులో డెమొక్రాట్లు రహస్య విచారణ చేపడుతున్నారని.. బహిరంగ విచారణ చేపట్టాలని గత కొంత కాలంగా రిపబ్లికన్ చట్టసభ్యలు డిమాండ్ చేస్తున్న దశ ఇప్పుడు వచ్చిందని తెలిపారు చిఫ్.