అమెరికా వ్యాప్తంగా వరుసగా ఏడో రోజు నిరసనలు మిన్నంటాయి. నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి న్యాయం జరగాలని పేర్కొంటూ అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి నివాసమైన శ్వేతసౌధం వద్ద వరసగా మూడో రోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు లక్ష్యంగా ఆందోళనకారులు కాల్పులు జరిపారు. అమెరికా జాతీయ జెండాకు నిప్పుపెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు రక్షణ సిబ్బంది.
దుకాణాలు లూటీ..
బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, ఫిలడెల్పియా, శాంటా మోనికా, కాలిఫోర్నియా నగరాల్లో ఆందోళనకారులు రోడ్లపై ఉన్న దుకాణాలను లూటీ చేస్తున్నారు. ఘటన జరిగిన మిన్నెపొలిస్లో ఓ ట్యాంకర్ నిరసనకారుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనకు కారణమైన డ్రైవర్ను అరెస్టు చేసినట్లు మిన్నెసొటా రాష్ట్ర పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అక్కడ ఆందోళనలను అణచివేసేందుకు సైన్యాన్ని మోహరించారు.
నిరసనల్లో పోలీసుల 'అతి'!
అట్లాంటాలో నిరసనలు చేస్తున్న ఇద్దరు కాలేజీ విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేసినందుకు ఇద్దరు పోలీసులను విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించారు మేయర్ కిషా లాన్స్. మరో ముగ్గురిని కార్యాలయ విధులకు మాత్రమే పరిమితం చేసినట్లు చెప్పారు. శనివారం జరిగిన నిరసనల సందర్భంగా వారు అతిగా ప్రవర్తించారని.. వీడియో పుటేజీ ఆధారంగానే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆందోళనల వెనక 'ఆంటిఫా' హస్తం?
నిరసనల వెనక వామపక్ష సంస్థ అయిన 'ఆంటిఫా' హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంటిఫా సంస్థను తీవ్రవాద సంస్థగా గుర్తించనున్నట్లు చెప్పారు. ఈ సంస్థ సహా పలు సామాజిక వ్యతిరేక బృందాలు ఇందులో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. వారిని అణచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.