అమెరికా విస్కాన్సిన్లోని కెనోషాలో ఓ పోలీసు జరిపిన కాల్పుల్లో ఓ నల్లజాతి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం మిల్వాకీలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదివారం సాయంత్రం ఐదుగంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా తలెత్తిన ఓ ఘటనను అడ్డుకునే ప్రయత్నంలో తుపాకీ ఉపయోగించినట్లు చెప్పారు. అయితే కాల్పులకు దారితీసిన పరిస్థితులపై స్పష్టతనివ్వలేదు.
కాల్పులకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారులోకి ప్రవేశించే సమయంలో పోలీసు అధికారి అడ్డుకున్నారు. అనంతరం కారులోకి కాల్పులు జరిపారు. ఏడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.
ప్రజాగ్రహం
ఈ ఘటనతో మరోసారి ప్రజల్లో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. పోలీసు కాల్పులకు వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు చేపట్టారు. పోర్ట్లాండ్లోని ఓ పోలీస్ స్టేషన్ ఆవరణకు నిరసనకారులు నిప్పంటించారు. నగరంలో భారీ ర్యాలీలు చేపట్టారు. ఆదివారం రాత్రంతా నిరసనలు జరిగాయి. కర్ఫ్యూ విధించినప్పటికీ భారీగా ప్రజలు వీధుల్లో మోహరించారు.
ఈ నేపథ్యంలో ఆందోళనలను కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించినట్లు తెలుస్తోంది.