అమెరికా మినియాపొలిస్‌లో పోలీసు కస్టడీలో మృతి చెందిన జార్జ్ ఫ్లాయిడ్‌కు మద్దతుగా యూఎస్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. మినియాపొలిస్‌లో ఆందోళనకారులు స్థానిక పోలీసు స్టేషన్‌కు నిప్పంటించారు. 'జస్టిస్ ఫర్ ఫ్లాయిడ్' అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. రహదారులపైనా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.
ట్రంప్ సరికొత్త స్వరం
ఫ్లాయిడ్ మృతిపై సరికొత్త స్వరం వినిపించారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఫ్లాయిడ్ పోలీసుల కస్టడీలో మృతి చెందడంపై స్పందిస్తూ.. ఆ దృశ్యాలు షాక్ కలిగించేలా ఉన్నాయని వెల్లడించారు. ఇదే అంశంపై చర్చ జరపాలని అటార్నీ జనరల్ బిల్ బార్‌కు సమన్లు జారీ చేశారు ట్రంప్. కేసును దర్యాప్తు చేయాల్సిందిగా ఎఫ్‌బీఐని ఆదేశించారు.