ఉద్యోగులంతా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోవడాన్ని తప్పనిసరి చేయడంపై న్యూయార్క్‌లోని స్టాటెన్లో కొందరు ఆందోళనకు (Vaccine Mandate Protest) దిగారు. సోమవారం నుంచి వ్యాక్సిన్ తీసుకున్నవారు మాత్రమే విధులకు హాజరుకావాలని (Vaccine Mandate Nyc) అక్కడి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగానే నగరంలో టీకాను వ్యతిరేకించిన 9వేల మంది పారిశుద్ధ్య సిబ్బందిని వేతనం చెల్లించని సెలవుపై పంపింది. ఈ క్రమంలో వారికి మద్దతుగా వ్యాక్సిన్‌ను వ్యతిరేకించే వారు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. నగరంలోని అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ నిరసనకు మద్దతుగా నిలిచారు.
టీకా తప్పనిసరి నిబంధన పరిధిలోకి వచ్చే కార్మికుల్లో 90శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నవారేనని నగర మేయర్ బిల్ డి బ్లాసియో చెప్పారు. నగరంలో సుమారు 3 లక్షలకుపైగా కార్మికులు ఉన్నట్లు తెలిపిన ఆయన.. సిబ్బంది కొరత కారణంగా సేవలకు ఎలాంటి అంతరాయాలు లేవని పేర్కొన్నారు.