తెలంగాణ

telangana

ETV Bharat / international

'ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టడంపైనే ట్రంప్​ దృష్టి' - ట్రంప్ వార్తలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానంపై బహిరంగ విచారణ ప్రారంభమైంది. విచారణలో అమెరికా అత్యున్నత దౌత్యవేత్తలైన విలియం టేలర్, జార్జీ కెంట్​లు పాల్గొన్నారు. బిడెన్​పై దర్యాప్తు చేసే విషయంపైనే అధ్యక్షుడు అధిక శ్రద్ధ కనబర్చినట్లు తెలిసిందని టేలర్ స్పష్టం చేయగా... తనపై జరుగుతున్న అభిశంసన చర్య మోసపూరితమని ట్రంప్ కొట్టిపారేశారు.

'ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టడంపైనే ట్రంప్​ దృష్టి'

By

Published : Nov 14, 2019, 1:15 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ అభిశంసన తీర్మానంపై ప్రారంభమైన బహిరంగ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా తన ప్రత్యర్థి జో బిడెన్​పై దర్యాప్తు చేయాలని ఉక్రెయిన్​ను అధ్యక్షుడిని ట్రంప్ కోరిన విషయంపై అమెరికా అత్యున్నత దౌత్యవేత్తలు వాంగ్మూలం ఇచ్చారు.

జో బిడెన్​పై బహిరంగ విచారణ జరిపించాలని ట్రంప్​ ఒత్తిడి తీసుకువచ్చిన అంశంపై ఉక్రెయిన్​లోని అమెరికా దౌత్యవేత్త విలియం టేలర్ ఇంటెలిజెన్స్​ కమిటీ ముందు సాక్షిగా హాజరయ్యారు. ఉక్రెయిన్​కు అమెరికా చేసిన సాయం కంటే బిడెన్​పై దర్యాప్తు చేసే విషయంపైనే ట్రంప్ శ్రద్ధ కనబర్చినట్లు తనకు తెలిసిందని టేలర్ వెల్లడించారు.

విచారణకు మరో దౌత్యవేత్త జార్జ్ కెంట్ హాజరయ్యారు. అధ్యక్షుడి అటార్నీ, మాజీ న్యూయార్క్​ మేయర్ గియులియానీ పాత్రపై అనుమానాలు వ్యక్తంచేశారు.

'రానున్న ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థులపై బురద జల్లడానికే ఆయన(గియులియానీ) ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నాను. అధికారంలో ఉన్నవారి ప్రత్యర్థులపై విచారణ జరిపించాలని మరో దేశాన్ని కోరే అవసరం అమెరికాకు లేదని నేను అనుకుంటున్నాను. ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధం.'
-జార్జ్ కెంట్, అమెరికా దౌత్యాధికారి

మోసం...అనుమతించకూడదు

అభిశంసన వ్యవహారంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తనపై జరుగుతున్న విచారణ మోసపూరితమైందని మండిపడ్డారు.

'ఇది మోసపూరితమైనది. దీనిని అనుమతించకూడదు. అసలు జరగకూడని సంఘటనలను కొందరు జరిగేలా చేశారు. బహిరంగ విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని ఒక్క నిమిషం కూడా చూడలేదు. ఎందుకంటే నేను టర్కీ అధ్యక్షుడితో ఉన్నాను. నాకు సంబంధించి విచారణ కంటే ఇదే ముఖ్యమైన విషయం.'
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఉక్రెయిన్​ అధ్యక్షుడితో మాట్లాడిన మరో ఫోన్​కాల్​ సంభాషణకు సంబంధించిన రాత ప్రతిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్.

'నేను రెండో కాల్​ గురించి సమాచారాన్ని విడుదల చేస్తున్నాను. నిజానికి అధ్యక్షుడితో మాట్లాడిన సంభాషణలో అదే మొదటిది. దాన్ని బట్టి ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. నాకు తెలిసినదాని ప్రకారం ఆ చరవాణి సంభాషణ మూడో వ్యక్తి నుంచి బయటకువచ్చింది. అది ప్రత్యక్షంగా వచ్చింది కాదు. ఆ సమాచారం ప్రత్యక్షంగా వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే నేను అసలు ఆ వ్యాఖ్యలు చేయలేదు. నాపై వచ్చిన వార్తలన్నీ గాలి వార్తలే.'
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details