అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించటం లేదు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన జార్జియాలో ఆడిట్ (చేతితో లెక్కింపు) ముగిసిన కొద్ది రోజుల్లోనే మళ్లీ రీకౌంటింగ్ చేపట్టారు అధికారులు. చేతితో లెక్కింపులో జో బైడెన్ విజయం సాధించారు. ట్రంప్‌పై 12,670 ఓట్లు, 0.25 శాతం మెజారిటీ సాధించారు. ఫలితాలను ధ్రువీకరించిన క్రమంలో రీకౌంటింగ్ చేపట్టాలని కోరారు అధ్యక్షుడు ట్రంప్.
రాష్ట్ర ఎన్నికల చట్టం ప్రకారం ఫలితాల్లో 0.5 శాతం లోపే మార్జిన్‌తో ఓటమి చెందిన వ్యక్తి రీకౌంటింగ్ కోరేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రీకౌంటింగ్ చేపట్టాలని గత శనివారం ఎన్నికల అధికారులను కోరింది ట్రంప్ బృందం.
ట్రంప్ బృందం అభ్యర్థన మేరకు మంగళవారం ఉదయం 9 గంటలకు సుమారు 5 మిలియన్ల ఓట్లను యంత్రాలు(హైస్పీడ్ స్కానర్లు) ద్వారా రీకౌంటింగ్ ప్రారంభించారు. డిసెంబర్ 2, రాత్రి 11.59 గంటల వరకు సమయం ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఓటింగ్ యంత్రాలను పరీక్షించాలని నిర్ణయించటం వల్ల ఆయా ప్రాంతాల్లో బుధవారం కౌంటింగ్ ప్రారంభం కానుంది.