నోబెల్ శాంతి బహుమతి-2021కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ అయ్యారు. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య ఒప్పందం కుదిర్చినందుకు.. నార్వే పార్లమెంట్ సభ్యుడు క్రిస్టియన్ ట్రైబిడ్రే జెడ్డే.. ట్రంప్ పేరును నామినేట్ చేశారు. తాజాగా ఈ విషయంపై శ్వేతసౌధం స్పందించింది. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య సామరస్యం నెలకొల్పేందుకు ట్రంప్ చాలా కృషి చేశారని.. అందుకు దక్కిన ఓ గొప్ప గౌరవమని పేర్కొంది. శాంతి నెలకొల్పడం సహా తన విదేశీ విధానాల వల్ల ట్రంప్ ఈ అర్హత సంపాదించుకున్నారని ప్రశంసలు కురిపించింది వైట్‌హౌస్.
"అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అవడం ఆయన పనికి ఓ గుర్తింపు. ఇజ్రాయెల్-యూఏఈ మధ్య శాంతి ఒప్పందానికి కారణం ఆయనే. ఇది 20 ఏళ్లలోనే చారిత్రాత్మక ఒప్పందం. అందుకే ఇది చాలా కష్టపడి సంపాదించుకున్నది. ట్రంప్ ఈ అవార్డుకు అర్హులు. తన విదేశీ విధానాల్లోనూ శాంతిని ప్రధానంగా భావిస్తున్నారు."
--కైలీ మెక్ననీ, వైట్‌హైస్ ప్రెస్ సెక్రటరీ
ఆ ఒప్పందంతో..
ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఆగస్టు 13న ఇజ్రాయెల్, యూఏఈ మధ్య దౌత్యసంబంధాలు కొత్త ఊపిరి పోసుకున్నాయి. ఆగస్టు 31న మొదటి వాణిజ్య విమానం ఇజ్రాయెల్ నుంచి అబుదాబిలో అడుగుపెట్టింది. జోర్డాన్, ఈజిప్ట్ తర్వాత ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు కుదుర్చుకున్న మూడో అరబ్ దేశంగా యూఏఈ నిలిచింది.