కొవిడ్‌పై పోరాడుతున్న వైద్య సేవల సిబ్బందికి వ్యక్తిగత గ్రీటింగ్ కార్డులు పంపడం సహా నర్సులు, అగ్నిమాపక సిబ్బందికి బిస్కెట్లు అందజేసిన భారత సంతతి చిన్నారి శ్రావ్య అన్నప్పరెడ్డిని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.
తెలుగమ్మాయి శ్రావ్యకు ట్రంప్ సత్కారం కరోనా సంక్షోభంలో ముందుండి సహాయం అందిస్తున్న కరోనా యోధులను సతీమణి మెలానియాతో కలిసి శ్వేతసౌధంలో సత్కరించారు ట్రంప్. ఇందులో మేరీల్యాండ్‌కు చెందిన పదేళ్ల బాలిక శ్రావ్య సైతం ఉంది.
తెలుగువారే!
మేరీల్యాండ్‌లోని హనోవర్ హిల్స్ ఎలిమెంటరీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది శ్రావ్య. మేరీల్యాండ్ గర్ల్స్ స్కౌట్స్ దళంలో సభ్యురాలు కూడా. గర్ల్స్ స్కౌట్స్ విభాగం నుంచి సన్మానానికి ఎంపిక చేసిన ముగ్గురిలో శ్రావ్య ఒకరు. శ్రావ్య తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్.
ఏం చేశారంటే?
మేరీల్యాండ్‌లోని ఎల్క్రిడ్జ్కు చెందిన 744వ బాలికల స్కౌట్స్ దళం ఈ గౌరవానికి ఎంపికైంది. ఇందులో లైలా ఖాన్, లారెన్ మాట్నీ, శ్రావ్య సభ్యులు. పదేళ్ల వయసున్న ఈ చిన్నారులంతా కలిసి 100 బాక్సుల బిస్కెట్లను మహమ్మారిపై పోరాడుతున్న స్థానిక వైద్యులు, నర్సులు, అగ్నిమాపక సిబ్బందికి అందజేశారు. 200 మంది వైద్య సేవల సిబ్బందికి వ్యక్తిగత గ్రీటింగ్ కార్డులు పంపించారు.
వారిలో ఒకరం
అధ్యక్షుడి సత్కారం అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే.. దేశవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు తమ వంతు సాయం చేస్తున్నారని, అందులో మేము ఒకరమని చెబుతున్నారు ఈ పెద్ద మనసున్న చిన్నారులు.
ఉపరాష్ట్రపతి ప్రశంసలు...
అమెరికా అధ్యక్షుడి ప్రశంసలు అందుకున్న తెలుగమ్మాయి శ్రావ్య అన్నపురెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు.