అమెరికన్ నగరాల్లో పోలీసు వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్‌ను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. పోలీసులు ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
నేరాల రేటు తగ్గింది..
తాజా గణాంకాల ప్రకారం, దేశంలో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని, దీనికంతటికీ పోలీసుల పనితీరే కారణమని ట్రంప్ ప్రశంసించారు. కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు కావాలని విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు.
జవాబుదారీతనం కావాలి
అమెరికన్ పోలీసు వ్యవస్థలో పాదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి, నల్లజాతీయులపై కొనసాగుతున్న జాతివివక్షపై ఆ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
శాంతియుతంగా నిరసనలు
మే 25న శ్వేతజాతి పోలీసుల కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు మరణించాడు. దీనితో అమెరికా అంతటా జాతివివక్ష వ్యతిరేక నిరసనలు చెలరేగాయి. ఈ సందర్భంగా నల్లజాతీయులపై దౌర్జన్యాలకు దిగుతున్న పోలీసు వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది. అయితే పోలీసు వ్యవస్థను రద్దు చేసే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చిచెప్పారు.
ఇదీ చూడండి:నేడు ఫ్లాయిడ్ అంత్యక్రియలు- వేలాది మంది నివాళి