అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో సరళమైన విధానాల పునరుద్ధరణపై అధ్యక్షుడు జో బైడెన్ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారని వెల్లడించింది శ్వేతసౌధం. కొద్ది వారాలుగా వరుసగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకాలు చేయటం ఆరంభం మాత్రమేనని పేర్కొంది. గత నాలుగు సంవత్సరాల్లో విభజనపూరితంగా, అమానవీయంగా తీసుకున్న అనైతిక విధానాలను సరిదిద్దడంపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలిపింది.
గ్రీన్‌కార్డులు, శాశ్వత నివాసాల అనుమతులపై వివక్షత, ఏకపక్షంగా ఉన్న పరిమితిని తొలగించే వరకు భారత్‌లోని ఏ ఒక్కరికి హెచ్-1బీ వీసాలు జారీ చేయొద్దని భారతీయ-అమెరికన్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇమ్మిగ్రేషన్ సలహా బృందం ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై ప్రశ్నించగా సమాధానమిచ్చారు శ్వేతసౌధం ప్రతినిధి.
అయితే.. అలాంటి ఆదేశాలు ఇచ్చే ఆలోచన ఉందా? అనే అంశంపై శ్వేతసౌధం స్పష్టతనివ్వలేదు. అదే సమయంలో, మానవత దృక్పథంతో సమగ్రమైన ఇమ్మిగ్రేషన్ సంస్కరణలకు కట్టుబడి ఉన్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించింది. ఈటీవల కాంగ్రెస్‌కు పంపిన ఇమ్మిగ్రేషన్ సంస్కరణ బిల్లులో.. ఇమ్మిగ్రేషన్ వాయిస్, భారత ఐటీ నిపుణుల సంస్థల ప్రధాన డిమాండైన గ్రీన్‌కార్డుల జారీలో దేశీయ కోటాను తొలగించటంపై ప్రతిపాదనలు చేసింది.
వివక్షత, ఏకపక్షంగా ఉన్న పరిమితి వల్ల లక్షల మంది గ్రీన్‌కార్డులు పొందేందుకు వేచిచూడాల్సి వస్తుందని, సుమారు సగటున 195 ఏళ్లు పడుతుందని అంచనా వేశారు ఇమ్మిగ్రేషన్ వాయిస్ సంస్థ అధ్యక్షుడు అమన్ కపూర్. అది 2030 నాటికి దరఖాస్తు చేసుకునే వారికి గ్రీన్‌కార్డు అందాలంటే 436 ఏళ్లు పడుతుందన్నారు. ఐఎన్ఏ సెక్షన్ 212(ఎఫ్)ను వినియోగించి చర్యలు తీసుకోవాలని బైడెన్ పరిపాలన విభాగాన్ని కోరారు.
ఇదీ చూడండి:'భారతీయులకు హెచ్1-బీ వీసాలు నిలిపివేయండి'