తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్ మనిషి రూపంలో ఉన్న తోలుబొమ్మ: మస్క్​ - జో బైడెన్ ఎలాన్ మస్క్ తాజా వ్యాఖ్యలు

Elon Musk On Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​పై మండిపడ్డారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. బైడెన్.. మానవ రూపంలో ఉన్న తోలుబొమ్మ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అమెరికన్లను జో బైడెన్‌ ఫూల్స్‌ మాదిరిగా చూస్తున్నారన్నారు. మరి ఈ వ్యాఖ్యలకు కారణం ఏంటి..?

president biden
జో బైడెన్​

By

Published : Jan 29, 2022, 8:17 AM IST

Elon Musk On Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనపై తరచూ విమర్శలు గుప్పించే టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికన్‌ ప్రజలను జో బైడెన్‌ ఫూల్స్‌ మాదిరిగా చూస్తున్నారంటూ మండిపడ్డారు. అమెరికాలో విద్యుత్తు కార్ల వినియోగం, పెట్టుబడులపై సమీక్ష సందర్భంగా మాట్లాడిన జో బైడెన్‌.. టెస్లా కంపెనీ పేరును ప్రస్తావించని నేపథ్యంలో ఎలాన్‌ మస్క్‌ ఈ విధంగా స్పందించారు.

ప్రపంచంలో బలమైన శక్తిగా ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు, లక్ష్యాల నిర్దేశం వంటి విషయాలపై ప్రముఖ సంస్థల సీఈఓలతో ఆయన భేటీ అయ్యారు. ఇందులో భాగంగా విద్యుత్తు కార్ల అధినేతలతోనూ సమావేశమయ్యారు. అనంతరం ట్విట్టర్‌లో స్పందించిన జో బైడెన్‌.. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీఎం (జనరల్‌ మోటార్స్‌), ఫోర్డ్‌ సంస్థలు స్థానికంగా భారీ స్థాయిలో విద్యుత్తు వాహనాలను తయారు చేస్తున్నాయంటూ కితాబిచ్చారు.

రానున్న రోజుల్లో విద్యుత్తు వాహనాల వినియోగం భారీగా ఉండబోతుందన్న ఆయన.. ఆ రంగంలో పెట్టుబడుల లక్ష్యాలను వివరించారు. అయితే, విద్యుత్‌ వాహన తయారీలో పేరుగాంచిన టెస్లా పేరును మాత్రం జో బైడెన్‌ ప్రస్తావించకపోవడంతోపాటు ఆ సంస్థ సీఈఓను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించలేదు.

ఈ నేపథ్యంలోనే బైడెన్‌ ట్వీట్‌పై స్పందించిన ఎలాన్‌ మస్క్‌.. తన సంస్థ పేరును (టెస్లా) పేర్కొంటూ జో బైడెన్‌కు రీ ట్వీట్‌ చేశారు. మానవ రూపంలో ఉన్న తోలుబొమ్మ అంటూ మరో ట్వీట్‌కు బదులిస్తూ అమెరికా అధ్యక్షుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అమెరికన్లను జో బైడెన్‌ ఫూల్స్‌ మాదిరిగా చూస్తున్నారంటూ మస్క్‌ తీవ్రంగా స్పందించారు.

ఇదిలాఉంటే, 2030 నాటికి అమెరికాలో అన్ని వాహనాలు ఎలక్ట్రిక్‌వే ఉండాలనే లక్ష్యంతో తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై గతేడాది జో బైడెన్‌ సంతకం చేశారు. ఆ సందర్భంలోనూ ఆయా కంపెనీల సీఈఓలతో అధ్యక్షుడు భేటీ అయ్యారు. బైడెన్‌ పాలనను వ్యతిరేకించే మస్క్‌కు మాత్రం ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు. తాజాగా మరోసారి అటువంటి ఘటనే ఎదురుకావడంతో బైడెన్‌పై ఎలాన్‌ మస్క్‌ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం

ఇదీ చూడండి:'బడులను తెరిచే ఉంచండి'

ABOUT THE AUTHOR

...view details