ఫలితాలపైనే ఇంతగా గోల చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధాన్ని ఖాళీ చేస్తారా? అధికార మార్పిడికి సహకరిస్తారా? దానికి కూడా అడ్డంకులు సృష్టిస్తారా? అనేవి అమెరికాలో ఆసక్తిరేకెత్తిస్తున్న ప్రశ్నలు! అయితే... అమెరికా అధ్యక్ష ఫలితాల అంతిమ ప్రకటనలతో సంబంధం లేకుండానే... అధికార బదిలీకి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నాలుగేళ్ళ కొత్త ప్రభుత్వ పాలనకు... రంగం సిద్ధమవుతోంది. ట్రంప్, బైడెన్‌లతో సంబంధం లేకుండానే... ఈ కసరత్తు జరుగుతుంది. ట్రంప్ మరీ మొండిగా వ్యవహరించి... తెగేదాకాలాగితే తప్పించి... ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందనే అనుకుంటున్నారు.
శ్వేతసౌధ అధికార బదిలీకి రంగం సిద్ధం!
అధికార మార్పిడికి అంత సులభంగా అంగీకరించబోనని ఎన్నికలకు ముందే తేల్చిచెప్పిన డొనాల్డ్ ట్రంప్.. శ్వేతసౌధాన్ని ఖాళీ చేస్తారా? అధికార మార్పిడికి సహకరిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందిరి మదిలో మెదులుతున్నాయి. అయితే... అమెరికా అధ్యక్ష ఫలితాల అంతిమ ప్రకటనలతో సంబంధం లేకుండానే... అధికార బదిలీకి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నాలుగేళ్ళ కొత్త ప్రభుత్వ పాలనకు... రంగం సిద్ధమవుతోంది. ట్రంప్, బైడెన్‌లతో సంబంధం లేకుండానే ఈ కసరత్తు జరుగుతుంది.
అమెరికా రాజ్యాంగం ప్రకారం.. కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటిదాకా ట్రంపే అధికారంలో ఉంటారు. కానీ... కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు తన ప్రభుత్వ కూర్పు కసరత్తు మొదలెట్టేస్తారు! అందుకు వీలు కల్పించేలా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులకు రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వ కార్యాలయాన్ని కేటాయిస్తారు. ఈ పనులన్నీ రాజ్యాంగబద్ధంగా కొన్ని నెలల కిందటినుంచే మొదలయ్యాయి. ఇందుకోసం అమెరికా రాజ్యాంగంలో ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. ఈసారి ఎన్నికల్లో బైడెన్ నెగ్గినట్లు ప్రకటించగానే ... ఆయనకు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు తాత్కాలిక కార్యాలయం, సిబ్బంది సదుపాయాలు కల్పిస్తారు. తద్వారా జనవరి 20లోపు వారు తమ ప్రభుత్వంలోని వివిధ పదవుల కూర్పుపై కసరత్తు చేసుకోవటానికి వెసులుబాటు లభిస్తుంది. అంటే ప్రమాణ స్వీకారం నాటికి దాదాపు 70 రోజుల సమయం వారికి అందుబాటులో ఉంటుంది. విదేశాంగ, రక్షణ మంత్రిత్వలాంటి కీలక శాఖలతోపాటు ప్రభుత్వంలోని సుమారు 4వేల పదవులను భర్తీ చేయటానికి, ప్రణాళికలకు ఈ సమయాన్ని కొత్తగా ఎన్నికైన వారు వాడుకుంటారు. ఈ 4వేల పదవుల్లో దాదాపు వెయ్యింటిని సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఫలితాలు తొందరగా తేలితే కొత్త అధ్యక్షుడికి కసరత్తుకు ఎక్కువ సమయం దొరుకుతుంది.
అయితే... విజయం దిశగా అడుగులు వేస్తున్నామని తెలియగానే... బైడెన్ వర్గం కొత్త ప్రభుత్వ కూర్పుపై కసరత్తు మొదలెట్టింది. ఒకవంక ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే... మరోవైపు బైడెన్ సన్నిహితుడు, నమ్మకస్తుడైన టెడ్ కాఫ్‌మన్ ఈ పనిలో నిమగ్నమైపోయారు. బైడెన్ ఉపాధ్యక్షుడు కాగానే... ఆయన డెలావర్ సెనెట్ సీటును కాఫ్‌మన్‌కు కేటాయించారు. 2008లో ఒబామా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా కాఫ్‌మన్ అధికార బదిలీలో కీలక పాత్ర పోషించారు. బైడెన్ చేసే నియామకాలకు సెనెట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది కాబట్టి... ముందు నుంచే జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే... సెనెట్‌లో ఈసారి రిపబ్లికన్‌లకు బలం చేకూరేలా ఉంది. మామూలుగానైతే... ఫలితాలు వెలువడగానే అధ్యక్షుడు వెళ్ళి కొత్తగా ఎన్నికైన వారిని అభినందించటం సంప్రదాయం. 2016లో ఒబామా అలాగే వెళ్ళి ట్రంప్‌ను కలిశారు. కానీ ఈసారి నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ట్రంప్-బైడెన్‌ల మధ్య ఆ సంప్రదాయం కొనసాగుతుందా అనేది ఆసక్తికరం!