బడులు ఎప్పుడు తెరుస్తారు? కాలేజీ చదువులెలా సాగుతాయి? కొలువులెలా ఉంటాయి? మున్ముందు ప్రయాణాలెలా? పనులెలా? కరోనాకు వ్యాక్సిన్ వస్తుందా? వంటి సమస్యలతో ప్రపంచమంతా తలపట్టుకుంటుంటే... వీటితో పాటు అమెరికాను మరో ముఖ్యమైన ప్రశ్న వేధిస్తోంది. అదే... అధ్యక్ష ఎన్నికలెలా? సజావుగా సాగేనా? చరిత్రలో ఎన్నడూ లేనట్లు వాయిదా పడేనా? ఒకవైపు కరోనా విజృంభణ.. మరోవైపు జాత్యహంకార ధోరణిపై కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలపై మేఘం ముసురుకుంది. ఇలాంటి సమయంలో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు ట్రంప్.
మోసాలు జరుగుతాయ్...!
నవంబర్ 3న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలను కొద్దిరోజుల పాటు వాయిదా వేయాలన్న తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్. దేశంలో కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో.. ప్రజలు ధైర్యంగా ఓటు వేసే వరకు ఎన్నికలు వాయిదా వేయడం మంచిదని ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. అనంతరం ఆ మాటలు చర్చనీయాంశం కావడం వల్ల మళ్లీ వివరణ ఇచ్చారు. మెయిల్ బ్యాలెట్లను లెక్కించడానికి ఎక్కువ సమయం పడుతుందని.. ఫలితంగా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందనే అలా మాట్లాడినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
మెయిల్-ఇన్ ఓటింగ్ చేపడితే 2020 ఎన్నికలు తప్పుడు, మోసపూరిత ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోతాయని ఆయన తొలుత పేర్కొన్నారు.
ఆది నుంచి వ్యతిరేకతే...
మెయిల్-ఇన్ ఓటింగ్ ప్రక్రియను ట్రంప్ తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే, నవంబర్‌లో జరగబోయే ఎన్నికలను రద్దు చేసేందుకు లేదా వాయిదా వేసేందుకు ట్రంప్ మొగ్గుచూపుతారని మొదటి నుంచి డెమొక్రాట్లు చెబుతూ వస్తున్నారు. అందుకు తగినట్టే... అమెరికా జీడీపీ భారీగా క్షీణించినట్లు వార్తలు వచ్చిన కాసేపటికే ట్రంప్ ఈ 'వాయిదా' ట్వీట్ చేశారు.
అయితే అమెరికా ఎన్నికల తేదీని మార్చే అధికారం అధ్యక్షుడికి ఉందా? అమెరికా రాజ్యాంగం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెబుతోంది చూద్దాం.
రాజ్యాంగంలో ఏముంది?
అమెరికాలో ఏ ఎన్నికలైనా వాయిదా వేసుకోవచ్చు. కానీ అధ్యక్ష ఎన్నికలకు ఆ అవకాశం లేదు. కారణం... అధ్యక్ష ఎన్నిక తేదీని అమెరికా రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవీ స్వీకారం చేసిన నాలుగేళ్ల తర్వాత వచ్చే నవంబరులో తొలి మంగళవారం నాడు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికలు జరగాలని అమెరికా రాజ్యాంగం నిర్దేశించింది.
ఎన్నికల తేదీని మార్చాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. ఒకవేళ ట్రంప్ అందుకు సిద్ధమైనా... ప్రస్తుతం డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ అందుకు అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకం! ట్రంప్ వ్యతిరేక అల్లర్లను పక్కనబెడితే... కరోనా కారణంగా ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయలేని దారుణమైన పరిస్థితులు తలెత్తితే మాత్రం డెమొక్రాట్లు వాయిదాకు మద్దతు ఇవ్వటం అనివార్యం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే నాలుగు నెలల్లో దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపైనే అధ్యక్ష ఎన్నికలు సకాలంలో జరుగుతాయా లేదా అనేది అధారపడుతుంది.
ట్రంప్ కొనసాగేందుకు వీలులేదు..!
ఒకవేళ రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే అది సంచలనమే అవుతుంది! అలా జరిగినా కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో కొనసాగలేరు. అమెరికా రాజ్యాంగం ప్రకారం- అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లే! జనవరి 20తో ముగుస్తుంది. కొత్తవాళ్ల ఎంపికతో దానికి సంబంధం లేదు. ఒకవేళ ట్రంప్ ఈసారి ఎన్నికల్ని వాయిదా (జనవరి దాటి) వేసినా రాజ్యాంగం ప్రకారం 2021 జనవరి 20న పదవిలోంచి దిగిపోవాల్సిందే!
అప్పటికీ ఎన్నికలు జరగకుంటే ప్రతినిధుల సభ (కాంగ్రెస్) కొత్త అధ్యక్షుడిని, సెనెట్ -ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తాయి (తాత్కాలికంగా)! కాంగ్రెస్ పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలు జరగకుంటే అప్పుడు అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సిన బాధ్యత సెనెట్ (ఇది మన రాజ్యసభ లాంటిది కాబట్టి పదవీకాలం ముగియటం అంటూ ఉండదు)పై పడుతుంది. ఇవన్నీ ఎన్నడూ అమెరికా చరిత్రలో జరగలేదు.
అల్లుడి నోట ఆ మాట...
ట్రంప్ ప్రత్యర్థి అయిన డెమొక్రాట్ల అభ్యర్థి బైడెన్ గతంలోనే ట్రంప్ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. "చూస్తుండండి... ఏదోలా చేసి, ఏవో మాటలు చెప్పి ఎన్నికల్ని వాయిదా వేయటానికి ట్రంప్ ప్రయత్నించినా ఆశ్చర్యపోనవసరం లేదు" అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం! ఆ మాటల్ని వెంటనే ట్రంప్ కొట్టేసినా... "ఏమో నాకు తెలియదుగాని... కరోనా కారణంగా ఎన్నికలు సమయానికి జరుగుతాయో లేదో" అంటూ శ్వేతసౌధం సలహాదారు... స్వయానా ట్రంప్ అల్లుడైన కుష్నర్ కొద్ది రోజుల కిందట వ్యాఖ్యానించటం మళ్లీ చర్చకు దారితీసింది.
వీటికి తోడుగా... కరోనా పరిణామాలు నాలుగు నెలల తర్వాత ఎలా ఉన్నా... తాజాగా అమెరికాలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ శిబిరం ఏం చేస్తుందనేది అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
ఎన్నికల నిర్వహణకు ఎన్నో మార్గాలు...
ఒకవేళ కరోనా విజృంభించినా కూడా ఎన్నికలను నిర్వహించుకునే అవకాశాలు అమెరికాలో ఉన్నాయి. సాధారణ ఓటింగ్‌తో పాటు ఆబ్సెంటీ బ్యాలెట్, మెయిల్ ఇన్ ఓటింగ్, ముందస్తు ఓటింగ్ లాంటి పద్ధతులు అందుకు కొంతమేరకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. భారీగా క్యూలలో నిలబడకుండా పోస్టు ద్వారా ఓటును పంపొచ్చు. ఇవన్నీ అమెరికా ఎన్నికల ప్రక్రియలో ముందే ఉన్నాయి. కానీ అవసరార్థం కొంతమందికే వీటిని వాడుతుంటారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయకుండా.. మెయిల్ ఇన్ ఓటింగ్‌ను అందరికీ వర్తింపజేయాలని డెమొక్రాట్లు సూచిస్తున్నారు. కానీ ఈ పద్ధతిని అందరికీ వర్తింపజేయటానికి రిపబ్లికన్లు, ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించటం లేదు.
"వృద్ధులకు, ఇళ్లలోంచి రాలేని వైకల్యంగలవారికి, మిలిటరీ సిబ్బందికి ఈ పద్ధతులు మంచివే. కానీ... మామూలు ప్రజలందరికీ మెయిల్ ఇన్ బ్యాలెట్ అంటే అవకతవకలకు తావిచ్చినట్లే! ఈ పద్ధతిలో బోలెడంత మోసం జరుగుతుంది. మెయిల్ బ్యాలెట్లను తారుమారు చేసే ప్రమాదముంది. అందరికీ ఈ పద్ధతి పెడితే.. రిపబ్లికన్ పార్టీ ఎన్నడూ అమెరికాలో ఇక మీదట అధికారంలోకి రాలేదు. దీన్ని మేం వ్యతిరేకిస్తాం" అని ట్రంప్ గతంలో స్పష్టం చేశారు.
ఈ మెయిల్ ఇన్ ఓటింగ్, ఆబ్సెంటీ ఓటింగ్ నిబంధనలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి. కనుక ఇదెంత మేరకు ఫలిస్తుందనేదీ చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నాలుగు నెలల్లో అమెరికాలో కరోనా విజృంభణ ఎలా ఉంటుందనేదానిపైనే ఎన్నికల తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయి.
ఇది మన పోస్టల్ బ్యాలెట్ లాంటిదే. ఎన్నికల రోజు నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేని పరిస్థితుల్లో పోస్టు ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
పోస్టు ద్వారా ముందే బ్యాలెట్‌ను పంపిస్తారు. దాన్ని తీసుకొని తమ ఓటు వేసి దగ్గర్లోని పోలింగ్ కేంద్రంలో సమర్పించాలి. లేదా పోస్టు ద్వారా పంపించొచ్చు.
ఓటింగ్ రోజే కాకుండా ముందుగానే తమ ఓటును వేయటానికి కల్పించే అవకాశం ఇది. ఈ పద్ధతులన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో ఒక్కోతీరుగా అమలవుతుంటాయి. ఇలా ఓటు వేయాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకున్న ఓటర్లు అందుకు సహేతుకమైన కారణాలను పేర్కొనాల్సి ఉంటుంది. వాటిని సంబంధిత అధికారి ఆమోదిస్తేనే ఈ తరహాలో ఓటింగ్‌కు అవకాశం కలుగుతుంది.
చరిత్ర ఏం చెబుతోంది?
ఇప్పటివరకు ఎన్నడూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడలేదు. ప్రపంచ యుద్ధ సమయాల్లోనే కాకుండా అమెరికా అస్తిత్వానికే సవాలు విసిరిన, అత్యంత క్లిష్టమైన 1864 అంతర్యుద్ధం సమయంలోనూ అధ్యక్ష ఎన్నికలు ఆగలేదు.