ఆన్లైన్లో శిక్షణ పొందుతున్న విదేశీ విద్యార్థులు అమెరికాను విడిచి వెళ్లాలన్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ప్రముఖ విద్యా సంస్థలు సహా చట్టసభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, అమెరికా వ్యవస్థలకు హాని కలిగిస్తుందని, దేశ భద్రతలో మార్పులు తీసుకురాదని కాంగ్రెస్ సభ్యులు థామ్సన్, కాథ్లీన్ రైస్ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
"విదేశీ విద్యార్థులపై పట్ల ట్రంప్ యంత్రాంగ వైఖరికి చట్టబద్ధమైన కారణాలు లేవు. విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని వారు కోరుకుంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు విదేశీ విద్యార్థులు బిలియన్ డాలర్లు అందిస్తున్నారు. వారిని దేశం నుంచి పంపిస్తే..అమెరికాకే నష్టం. వలసదారులపై తనకున్న వ్యతిరేకతను సంతృప్తి పరచుకోవడానికి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను ఇక సహించలేము. దీని వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. విశ్వవిద్యాలయాలకు హాని జరుగుతోంది. ఈ నిర్లక్ష్యపూరిత విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం."
-- కాంగ్రెస్ చట్టసభ్యుల సంయుక్త ప్రకటన.
ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందుతున్న విదేశీ విద్యార్థులను.. వెనక్కి పంపించే విధంగా మంగళవారం నూతన నిబంధనలను జారీ చేసింది అగ్రరాజ్య ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. అమెరికాలో విశ్వవిద్యాలయాల పునఃప్రారంభంపై ఒత్తిడి పెంచింది.
ఈ కొత్త విధానం వల్ల విదేశీ విద్యార్థుల్లో అనిశ్చితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు స్టాన్ఫోర్డ్ అధ్యక్షుడు మార్క్ టెస్సర్ లావిగ్నె.