మోదీ హర్షం..
క్వాడ్ దేశాధినేతలతో జరిగిన భేటీపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం విస్తృతంగా, ఉత్పాదకంగా జరిగిందని ట్వీట్ చేశారు. కూటమి నేతలతో దిగిన ఫొటోను షేర్ చేశారు.
03:47 September 25
మోదీ హర్షం..
క్వాడ్ దేశాధినేతలతో జరిగిన భేటీపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం విస్తృతంగా, ఉత్పాదకంగా జరిగిందని ట్వీట్ చేశారు. కూటమి నేతలతో దిగిన ఫొటోను షేర్ చేశారు.
03:05 September 25
క్వాడ్ సదస్సు ముగిసిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ.. న్యూయార్క్‌కు బయలుదేరుతారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. ఐక్యరాజ్య సమితి 76వ సాధారణ అసెంబ్లీ సమావేశంలో ఆయన పాల్గొంటారని చెప్పారు.
02:54 September 25
క్వాడ్ నేతలతో కమల భేటీ..
మరికాసపేట్లో క్వాడ్ నేతలతో తన కార్యాలయంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ భేటీ కానున్నారు. అయితే.. ఈ సమవేశానికి మోదీ హాజరు కావటం లేదు.
02:49 September 25
ముగిసిన క్వాడ్ సదస్సు..
వైట్‌హౌస్‌లో తొలిసారి నేరుగా జరిగిన 'క్వాడ్' దేశాధినేతల సదస్సు ముగిసింది. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి, సౌభాగ్యాల స్థాపనకు కలిసికట్టుగా కృషిచేయాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది. వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించింది.
00:32 September 25
విద్యార్థుల కోసం క్వాడ్ ఫెలోషిప్..
క్వాడ్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. క్వాడ్ దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో 'స్టెమ్' కార్యక్రమాల్లో అడ్వాన్స్డ్ డిగ్రీ విద్యను అభ్యసించేందుకుగాను క్వాడ్ ఫెలోషిప్‌ను ప్రకటించారు.
23:56 September 24
అది ఇండో పసిఫిక్ దేశాలకు మేలు చేస్తుంది: మోదీ
ఇతర దేశాలకు వ్యాక్సిన్ అందించేందుకు క్వాడ్ దేశాలు తీసుకున్న చొరవ.. ఇండో పసిఫిక్ దేశాలకు ఎంతో మేలు చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సానుకూల విధానంతో ఉమ్మడి ప్రజాస్వామ్య విలువల ఆధారంగా ముందుకు సాగాలని క్వాడ్ కూటమి నిర్ణయం తీసుకుందని చెప్పారు. క్వాడ్ కూటమిలోని మిత్రులతో సరఫరా గొలుసు, అంతర్జాతీయ భద్రత, వాతావరణ మార్పులు, కరోనా వంటి అంశాలపై చర్చించడం సంతోషంగా ఉందని తెలిపారు.
23:47 September 24
ప్రారంభమైన క్వాడ్ సదస్సు..
అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా కూటమి 'క్వాడ్' సదస్సు శ్వేతసౌధంలో ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదే సుగా ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ భేటీలో అంతరిక్ష రంగంలో మార్పులు, సప్లయ్ చైన్ విధివిధానాలతో పాటు.. 5జీ టెక్నాలజీ విస్తరణపై కీలక చర్చలు జరగనున్నట్లు శ్వేతసౌధ వర్గాలు అంతకుముందు ప్రకటించాయి. టీకాల సరఫరా, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల రంగంలోనూ కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
23:30 September 24
ఈస్ట్రూమ్కు చేరుకున్న భారత ప్రతినిధులు
క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రతినిధులు వైట్‌హౌస్‌లోని ఈస్ట్రూమ్కు చేరుకున్నారు.
22:20 September 24
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ శ్వేతసౌధాన్ని వీడారు. అనంతరం బైడెన్ అధ్యక్షతన జరగనున్న క్వాడ్ సమావేశానికి హాజరవుతారు.
22:17 September 24
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన భారత పర్యటనను గుర్తుచేసుకున్నారు. ఉపాధ్యక్షుడి హోదాలో ముంబయికి వచ్చిన తనను.. భారత్‌లో బంధువులెవరైనా ఉన్నారా అని మీడియా ప్రశ్నించిందని తెలిపారు. అదే సమయంలో మా వద్ద ఐదుగురు బైడెన్లు ఉన్నట్లు చమత్కరించారని నాటి క్షణాలను గుర్తుచేసుకున్నారు.
22:07 September 24
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయిన భారత ప్రతినిధి బృందంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబల్, అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు, ప్రధాన మంత్రి జాయింట్ సెక్రటరీ ఆర్జీ శ్రేష్ఠ్, ప్రధాని ప్రైవేట్ సెక్యూరిటీ కుమార్‌లు హాజరయ్యారు.
22:00 September 24
శ్వేతసౌధంలోని అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ రూమ్‌ని సందర్శించారు మోదీ. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.
21:49 September 24
ప్రపంచంలోనే భారత్, అమెరికా అత్యంత సన్నిహిత దేశాలని బైడెన్ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ప్రపంచ సమస్యల పరిష్కారంలో సహాయపడతాయన్నారు. ఇరుదేశాలు 2020 నాటికి ప్రపంచంలోనే అత్యంత మిత్ర దేశాల్లో ఒకటిగా ఉంటాయని ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే చెప్పినట్లు పేర్కొన్నారు.
21:41 September 24
బైడెన్‌తో భేటీ సందర్భంగా సాంకేతికత ప్రాముఖ్యాన్ని మోదీ ప్రస్తావించారు. టెక్నాలజీ అనేది ప్రపంచ శక్తిగా మారుతోందన్నారు. ప్రపంచ ప్రయోజనాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు.
21:34 September 24
మోదీతో సమావేశంలో భాగంగా గాంధీ జయంతిని బైడెన్ ప్రస్తావించారు. దీనిపై స్పందించి మోదీ.. గాంధీజీ సూత్రాలు రాబోయే రోజుల్లో భూగ్రహానికి చాలా అవసరమని బదులిచ్చారు. ఇక కరోనాపై పోరు, వాతావరణ మార్పులు అనేవి భారత్-అమెరికా స్నేహానికి కీలకమని మోదీ వ్యాఖ్యానిచారు. క్వాడ్ సమావేశంపై బైడెన్ ప్రయత్నాలను మోదీ ప్రశంసించారు.
21:19 September 24
తనకు లభించిన ఘన స్వాగతంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలంగా, సన్నిహితంగా, ఉండాలని ఆకాంక్షించారు.
20:38 September 24
అమెరికా అధ్యక్షుడు బైడెన్-మోదీల మధ్య భేటీ ప్రారంభమైంది. వివిధ అంశాలపై ఇరువురూ ఓవల్ ఆఫీస్‌లో సుమారు గంటపాటు సమావేశం కానున్నారు. అంతకుముందు భారీ భద్రత నడుమ ప్రధాని నరేంద్ర మోదీ శ్వేతసౌధానికి చేరుకున్నారు.
మరోవైపు.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నట్లు బైడెన్ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, వాతావరణ మార్పులు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చించేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
20:27 September 24
శ్వేతసౌధంలో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశాన్ని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వైట్‌హౌస్ ప్రధాన ద్వారం వద్ద పెద్దఎత్తున హాజరైన ప్రజలు.. భారతీయ సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు.
19:46 September 24
భారత్-అమెరికా ద్వైపాక్షిక సమావేశం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్-భారత ప్రధాని నరేంద్ర మోదీ మొట్ట మొదటిసారి ప్రత్యక్షంగా సమావేశం అవుతున్నారు. ఇరు దేశాధినేతల మధ్య తొలి ద్వైపాక్షిక భేటీ ఇదేకావడం విశేషం. అఫ్గాన్ సంక్షోభం సహా.. వాతావరణ మార్పులు, వాణిజ్య సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు. రాత్రి 8:30గంటలకు(భారత కాలమానం ప్రకారం) శ్వేతసౌధంలో వీరి చర్చలు ప్రారంభమవుతాయి. గంటపాటు కీలక విషయాల గురించి చర్చిస్తారు.
సమావేశం అజెండా..
వాణిజ్యం, పెట్టుబడి సంబంధాల బలోపేతం, రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు శ్వేతసౌధ అధికారులు ప్రకటించారు. తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్‌ల ధ్వంసంపై ప్రధానంగా చర్చలు ఉంటాయని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా పేర్కొన్నారు. ఈ భేటీకి మోదీతోపాటు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబల్, అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధుతో పాటు సీనియర్ అధికారులు హాజరవనున్నారు.
అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత మోదీతో భేటీ కానుడటం ఇదే తొలిసారి. అంతకుముందు ఇరువురు నేతలూ పలుసార్లు ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారు. 'క్వాడ్' సహా కొన్ని సదస్సులకు వర్చువల్‌గా హాజరయ్యారు.
క్వాడ్ భేటీ..
మరోవైపు.. ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాల కూటమి 'క్వాడ్' దేశాధినేతల మధ్య శ్వేతసౌధంలో శుక్రవారం చారిత్రక సమావేశం జరగనుంది. ఈ భేటీలో అంతరిక్ష రంగంలో మార్పులు, సప్లయ్ చైన్ విధివిధానాలతో పాటు.. 5జీ టెక్నాలజీ విస్తరణపై కీలక చర్చలు జరగనున్నట్లు శ్వేతసౌధ వర్గాలు ప్రకటించాయి. టీకాల సరఫరా, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల రంగంలోనూ కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
'ఇండో-పసిఫిక్ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లు, క్లిష్టమైన సమస్యలపై క్వాడ్ దేశాధినేతలు చర్చలు జరుపుతారని, పరస్పర ఆందోళనలను గుర్తిస్తారని' సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారిపై పోరు వంటి అంశాలూ చర్చకు రానున్నట్లు వివరించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా వైట్‌హౌస్‌లో తొలిసారి జరగనున్న 'క్వాడ్ శిఖరాగ్ర సదస్సు'లో పాల్గొంటున్నారు.
ప్రాధాన్య అంశాలు..
క్వాడ్‌తో కమల చర్చలు..
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ క్వాడ్ దేశాధినేలతో సమావేశం నిర్వహించనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. శ్వేతసౌధంలోని ఈస్ట్ రూమ్‌లో జరగనున్న తొలి సమావేశానికి కమలా హారిస్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. 'కమలా హారిస్ మూడు క్వాడ్ దేశాల ప్రధానులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. దీనిలో కరోనా మహమ్మారిపై పోరు, వాతావరణ మార్పులు, వాణిజ్య సహకారం, అఫ్గాన్ సమస్య వంటి అంశాలు చర్చకు రానున్నాయి.' అని శ్వేతసౌధ అధికారి ఒకరు వెల్లడించారు.