అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్‌లో ఇరువురు నేతలూ సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత ఆయనతో మోదీ ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే తొలిసారి. శ్వేతసౌధంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. జో బైడెన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తొలిసారి జరిగిన ఈ ద్వైపాక్షిక భేటీలో కరోనాపై పోరాటం, వాతావరణ మార్పులు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై కీలకంగా చర్చించారు. అలాగే, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించినట్టు సమాచారం.
ఇదో సరికొత్త అధ్యాయం.. బైడెన్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని అన్నారు. ఇరు దేశాల దృఢమైన బంధం కోసమే ఈ చర్చలని తెలిపారు. 40 లక్షల మంది ఇండో- అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తిమంతం చేస్తున్నారని మోదీతో అన్నారు. ఇరు దేశాల సబంధాల్లో ఈ భేటీ సరికొత్త అధ్యాయమని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను భారత్-అమెరికా బంధం పరిష్కరిస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు బైడెన్ మోదీతో అన్నారు.