తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా టీకా: చిన్నారులపై 'ఫైజర్' ట్రయల్స్‌ - అమెరికా కంపెనీ ఫైజర్

కరోనా టీకాను చిన్నపిల్లలకు సైతం అందించేందుకు ఫైజర్​ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు మొదటి దశ ప్రయోగాల్లో మూడు వేర్వేరు మోతాదులతో 144 మంది 6 నెలల వయసున్న చిన్నారులపై టీకా సామర్థ్యాన్ని పరీక్షించనుంది.

pfizer-launch-covid-vaccine-trial-in-children
కరోనా టీకా: చిన్నారులపై ఫైజర్ ట్రయల్స్‌

By

Published : Mar 26, 2021, 5:58 PM IST

వచ్చే ఏడాది ఆరంభానికి 12 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ సిద్ధమవుతోంది. జర్మనీకి చెందిన భాగస్వామ్య సంస్థ బయోఎన్‌టెక్‌తో కలిసి ఆ వయసు వారిపై టీకా ప్రయోగాలు ప్రారంభించినట్లు తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా బుధవారం వాలంటీర్లకు టీకా అందించినట్లు ఆ సంస్థ ప్రతినిధి షారోన్ క్యాస్టిల్లో వెల్లడించారు.

6 నెలల చిన్నారులపై..

16 ఏళ్లు, ఆపై వయస్సు వారి కోసం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ గతేడాది డిసెంబర్‌లో ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆ దేశంలో 66 మిలియన్ల డోసులను పంపిణీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, తాజా ట్రయల్స్‌లో 6నెలల వయసున్న చిన్నారులను కూడా భాగం చేయనున్నారు. మొదటి దశలో మూడు వేర్వేరు మోతాదులతో 144 మంది వాలంటీర్లపై టీకా భద్రతను సంస్థ పరీక్షించనుంది. తరవాతి దశలో 4,500 మంది వాలంటీర్లపై క్లినికల్ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ప్రయోగాల్లో భాగంగా చిన్నారుల్లో టీకా భద్రత, రోగనిరోధక ప్రతిస్పందనను పరీక్షించనున్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 3-17 సంవత్సరాల వయసు వారికి సురక్షితమని, మెరుగైన సామర్థ్యాన్ని ఇస్తున్నట్లు తేలిందని చైనా ఫార్మా సంస్థ సినోవాక్ ఇటీవల వెల్లడించింది. తొలి, మధ్యస్థాయి క్లినికల్ ట్రయల్స్‌ ఫలితాల ఆధారంగా సినోవాక్ ఈ ప్రకటన చేసింది. అయితే దీనిపై మరిన్ని ప్రయోగాలు నిర్వహించాల్సి ఉందని తెలిపింది.

ఇదీ చదవండి:ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా తొలి దశ పరీక్షలకు సిఫారసు

ABOUT THE AUTHOR

...view details