భారత్‌లో తొలుత వెలుగు చూసిన డెల్టా వేరియంట్(బి.1.167.2)పై ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం మరింత గుబులు రేపుతోంది. ఈ వేరియంట్‌పై ఫైజర్-బయోఎన్‌టెక్ రూపొందించిన కరోనా టీకా విడుదల చేసే యాంటీబాడీల స్థాయులు తక్కువేనని తెలిపింది. ఫైజర్ టీకాతో తొలుత ఉన్న కరోనా వైరస్‌పై పోరాడేందుకు విడుదలయ్యే యాంటీబాడీలతో పోలిస్తే.. డెల్టా రకం వైరస్‌కు ఉత్పత్తయ్యే యాంటీబాడీల స్థాయులు ఐదు రెట్లు తక్కువని యూకేలోని 'ఫాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్' పరిశోధకులు జరిపిన అధ్యయనం పేర్కొంది.
అలాగే, వయసు పెరుగుతున్న కొద్దీ వైరస్‌ను గుర్తించి పోరాడే యాంటీబాడీల స్థాయులు మరింత తగ్గిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో ముప్పు ఎక్కువగా ఉన్నవారికి బూస్టర్ డోసు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఫైజర్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలన్న యూకే నిర్ణయాన్ని ఈ అధ్యయనం సమర్థించింది. డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన స్థాయిలో యాంటీబాడీలు కేవలం ఒక్క డోసుతో ఉత్పత్తి కావడం లేదని పేర్కొంది.
ఇదీ చదవండి:'కొవిడ్‌ను వదిలేసి విమర్శకులపై మోదీ ప్రభుత్వం కొరడా'
అయితే, వ్యాక్సిన్ రక్షణ సామర్థ్యాన్ని కేవలం యాంటీబాడీల స్థాయులు మాత్రమే నిర్ధారించవని అధ్యయనం పేర్కొంది. దీనిపై ఇంకా మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. తక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయినప్పటికీ.. కొవిడ్-19 నుంచి రక్షణనిచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఫైజర్ తొలిడోసు టీకా తీసుకున్న ఆరోగ్యవంతులైన 250 మంది రక్త నమూనాల్ని సేకరించి అధ్యయనం జరిపారు. ఐదు రకాల కరోనా వేరియంట్లను కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే సామర్థ్యం ఈ యాంటీబాడీలకు ఏ మేర ఉందో పరిశీలించారు.