తెలంగాణ

telangana

ETV Bharat / international

24 గంటల్లోపే మొదటి టీకా వేస్తాం: ట్రంప్ - ఫైజర్ కరోనా టీకా

24 గంటల్లోపు కరోనా మొదటి టీకా డోసును ప్రజలకు ఇవ్వడం ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ఎవరికి మొదటి డోసు ఇవ్వాల్లో గవర్నర్లు నిర్ణయిస్తారని చెప్పారు. వృద్ధులు, వైద్య సిబ్బందికి మొదట టీకా అందించనున్నట్లు తెలిపారు. మరోవైపు, టీకాపై విశ్వాసం ఉంచాలని అమెరికన్లను కోరారు జో బైడెన్.

Pfizer vaccine will be administered in less than 24 hrs: Trump
24 గంటల్లోపే మొదటి టీకా వేస్తాం: ట్రంప్

By

Published : Dec 12, 2020, 4:01 PM IST

ఫైజర్‌ కరోనావైరస్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ప్రకటన చేసిన నేపథ్యంలో..ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ వేదికగా స్పందించారు. 24 గంటల్లోపు మొదటి టీకా డోసును ప్రజలకు ఇవ్వడం ప్రారంభించనున్నామని ట్విట్టర్‌లో విడుదల చేసిన టెలివిజన్ ప్రసంగంలో వెల్లడించారు.

"ఫెడ్ఎక్స్‌, యూపీఎస్‌తో మాకున్న భాగస్వామ్యం ద్వారా ఇప్పటికే దేశంలోని ప్రతి రాష్ట్రానికి టీకా రవాణాను ప్రారంభించాం. ఆయా రాష్ట్రాల్లో ఎవరికి మొదటి డోసు ఇవ్వాల్లో గవర్నర్లు నిర్ణయిస్తారు. కరోనా ముప్పు అధికంగా ఉన్న వృద్ధులు, వైద్య సిబ్బందికి మొదట టీకా అందించాలని మేం కోరుకుంటున్నాం. ఇది మరణాల రేటు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించనుంది"

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

కరోనా వైరస్‌తో తీవ్రంగా అల్లకల్లోమైన అగ్రదేశం.. టీకా కోసం వేయికళ్లతో ఎదురుచూసింది. ప్రస్తుతం ఫైజర్‌కు ఎఫ్‌డీఏ అనుమతి ఇవ్వడంతో.. ఇప్పటికే ఆ దేశంలో దాదాపు మూడు లక్షల మంది ప్రాణలు బలిగొన్న మహమ్మారికి అంతిమ గడియలు మొదలైనట్టేనని అంతా భావిస్తున్నారు. తొలుత అందే మూడు మిలియన్ల డోసులను వైద్యారోగ్య, మిలిటరీ సిబ్బందితో పాటు వృద్ధులకు వారం రోజుల్లో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, ఒప్పందం ప్రకారం మార్చి నాటికి అమెరికాకు ఫైజర్ 100 మిలియన్‌ డోసుల్ని అందించాల్సి ఉంది. అలాగే, ప్రజలందరికీ టీకా ఉచితంగానే అందజేస్తామని ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

విశ్వసించండి: బైడెన్

కరోనా టీకాపై ప్రజలు పూర్తి విశ్వాసం ఉంచాలని అభ్యర్థించారు అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్. ఎలాంటి రాజకీయ ప్రాబల్యం లేకుండా ఉత్తమమైన శాస్త్రవేత్తలు ఈ టీకాను అభివృద్ధి చేశారని అన్నారు. వ్యాక్సిన్ భద్రతకు అవసరమైన ప్రతి అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారని చెప్పారు. శాస్త్రీయ సమగ్రత తమను ఈ స్థాయికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details