Pfizer for under 5 years kids: చిన్న పిల్లలకు కొవిడ్ టీకా అంశంలో కీలక ముందడుగు పడింది. ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా వేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆరు నెలల పసికందు నుంచి నాలుగేళ్ల చిన్నారులకు కొవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ-ఎఫ్డీఏకు దరఖాస్తు చేసుకుంది ఫైజర్.
తమ కొవిడ్ టీకాకు ఇచ్చిన అత్యవసర వినియోగ అనుమతిని సవరించి 6నెలల పసికందు నుంచి నాలుగేళ్లలోపు చిన్నారులను కూడా చేర్చాలని ఎఫ్డీఏను కోరినట్లు ఫైజర్ తెలిపింది. ఎఫ్డీఏ అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలిటీకాగా ఫైజర్ నిలవనుంది. కరోనా కారణంగా అమెరికాలో ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్ తెలిపింది. భవిష్యత్ వేరియంట్లను ఎదుర్కొనటంతో పాటు వైరస్ నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడుకునేందుకు ఎఫ్డీఏతో కలిసి పని చేస్తున్నట్లు ఫైజర్ పేర్కొంది.